Jupelli krishna rao: కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్‌ది రాజకీయ డ్రామా

Jupelli krishna rao: తెలంగాణ రైతుల ప్రయోజనాల కంటే బీఆర్‌ఎస్‌కు రాజకీయాలే ముఖ్యమయ్యాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. కృష్ణా జలాల పంపకాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలకు ఎలా ఒప్పుకున్నారో బీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏపీకి దోచిపెడుతోందని కేసీఆర్ ఆరోపిస్తున్నారని, కానీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు బీఆర్‌ఎస్ సభకు ఎందుకు రాలేదని జూపల్లి ప్రశ్నించారు. కృష్ణా జలాలపై నిజంగా చర్చకు సిద్ధమైతే అసెంబ్లీకి వచ్చి వాదించాలని ఆయన సవాల్ విసిరారు.

కేంద్రంతో కేసీఆర్‌కు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాటిని వినియోగించలేదని మంత్రి ఆరోపించారు. జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలంకు నీటి వనరును మార్చడం వెనుక అవినీతి ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జూరాల కింద రిజర్వాయర్ ఎందుకు నిర్మించలేదని, కల్వకుర్తి కింద రిజర్వాయర్ ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు.

అదేవిధంగా, సరైన ప్రదేశం కాకపోయినా ప్లేగ్రౌండ్‌లా ఉన్న ప్రాంతంలో 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్‌ను నిర్మించారని విమర్శించారు. ఈ నిర్ణయాల వల్ల రైతులకు తగిన ప్రయోజనం దక్కలేదని ఆయన అన్నారు.

కృష్ణా జలాల విషయంలో బీఆర్‌ఎస్ మాటలకు, చర్యలకు పొంతన లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా చర్చకు సిద్ధంగా ఉందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *