Jupelli krishna rao: మంత్రి జూపల్లి గంజాయి స్మగ్లర్లపై తీవ్రంగా హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, అవసరమైతే ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు.
గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్యకు ప్రస్తుతం వైద్య చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆమె ఒక కిడ్నీని తొలగించగా, మరో కిడ్నీ పనిచేయడానికి డయాలసిస్ నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి జూపల్లి భరోసా ఇచ్చారు. ఆమె చికిత్సకు అయ్యే అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. అలాగే ఎక్సైజ్ అధికారుల భద్రత కోసం త్వరలో వారికి ఆయుధాలు అందజేస్తామని చెప్పారు. మత్తు పదార్థాల మాఫియాను పూర్తిగా కట్టడి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
