Jubilee Hills Bypoll: సోమాజిగూడ శ్రీనగర్‌లో కాంగ్రెస్ బూత్ స్థాయి సన్నాహక సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వందలాది మంది మహిళా నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. గురువారం సోమాజిగూడ శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి సన్నాహక సమావేశం విజయవంతమైంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వీరితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ రియాజ్, కార్పొరేటర్లు విజయా రెడ్డి, సంగీత, మాజీ ఎంపీ అజారుద్దీన్, ఎన్‌ఎస్‌యూఐ సెక్రటరీ కుందన్ యాదవ్, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ మరియు స్థానిక సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
వందలాది మంది మహిళా నేతల చేరిక:
Also Read: MLC Nagababu: శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించిన ఎమ్మెల్సీ నాగబాబు
ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ సీనియర్ మహిళా నేత ఆది లక్ష్మి ఆధ్వర్యంలో వందలాది మంది మహిళా నాయకులు ఏఐసీసీ ఇంచార్జీ, టీపీసీసీ చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ భారీ చేరికలతో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకుంది.
‘ఇది విధ్వంసం వర్సెస్ వికాసం ఎన్నిక’ – మహేష్ గౌడ్
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రసంగిస్తూ.. ఈ ఉపఎన్నిక కేవలం ఓట్ల కోసం జరిగే ఎన్నిక కాదని, “పదేళ్ల విధ్వంస పాలనకు, 2 ఏళ్ల కాంగ్రెస్ వికాస పాలనకు” మధ్య జరుగుతున్న ఎన్నిక అని పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే మనం అధికారంలోకి రాగలిగాం’ అని అన్నారు. పాత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది’ అని తెలిపారు.
యువతను మత్తుకు బానిస చేశారు:
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు పదేళ్ల పాలనలో ఏం జరిగిందో ఆలోచించాలని మహేష్ గౌడ్ కోరారు. ‘రాష్ట్రాన్ని డ్రగ్స్ మయంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. యువతను మత్తుకు బానిస చేశారు’ అని ఆరోపించారు. ప్రజలు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
