Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మధురానగర్, బోరబండ పోలీస్ స్టేషన్ల పరిధిలో వారిపై ఆయా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ ఫిర్యాదులను స్వీకరిస్తామని, ఎవరి వద్ద అయినా ఆధారాలు ఉంటే పంపాల్సిందిగా కోరుతున్నారు.
Jubilee Hills: మధురానగర్ పరిధిలోని ఆలేరు, వైరా, డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన బీర్ల అయిలయ్య, మాలోత్ రాందాస్, రామచంద్రనాయక్లు ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించారని కేసులు నమోదు చేశారు. స్థానిక ఓటర్లను ప్రభావితం చేసేలా పార్టీ చిహ్నాలను ప్రదర్శించారని ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ మేరకు మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై రెండు కేసులు నమోదయ్యాయి.
Jubilee Hills: బోరబండ డివిజన్ సైట్- 3లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ధాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్ తమ పార్టీ కరపత్రాలను పంచుతూ ఓటర్లను ప్రభావితం చేశారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ మేరకు ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు.
