Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం

Jubilee Hills Bypoll: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నిక ప్రచార ఘట్టం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. భారాస ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఉపఎన్నికలో, 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధానంగా అధికార కాంగ్రెస్, భారాస, భాజపా మధ్యే ముక్కోణపు పోటీ నెలకొంది. ఈ మూడు పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, చివరి నిమిషం వరకు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పోలింగ్ నవంబర్ 11న జరగనుండగా, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన నవంబర్ 14న ఉండనుంది.

ప్రధాన అభ్యర్థులు: దివంగత ఎమ్మెల్యే భార్య మాగంటి సునీత (భారాస), అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, భాజపా నుంచి లంకల దీపక్‌రెడ్డి విజయం కోసం తీవ్రంగా శ్రమించారు.

ప్రధాన పార్టీల ఎన్నికల వ్యూహాలు
అధికార కాంగ్రెస్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రచార బాధ్యతలు చేపట్టి, నాలుగు రోజులు రోడ్‌షోలు నిర్వహించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం నినాదాలతో ముందుకెళ్లిన కాంగ్రెస్, నియోజకవర్గంలో దాదాపు రూ.300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని ప్రచారం చేసింది. సీఎం తమ ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై విమర్శల వర్షం కురిపించారు. డివిజన్‌కు ఇద్దరు మంత్రులను, పది పోలింగ్ కేంద్రాలకు ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలను నియమించి కాంగ్రెస్ పక్కాగా వ్యూహ రచన చేసింది.

భారాస ప్రచార అస్త్రం ‘బాకీ కార్డు’: మాజీ అధికార పార్టీ భారాస, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపిస్తూ ‘బాకీ కార్డుల’ ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దివంగత ఎమ్మెల్యే కుటుంబ సెంటిమెంట్‌తో పాటు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై ప్రచార బాధ్యతలను నిర్వహించారు. ఆయన అన్ని డివిజన్లలో పర్యటించి, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మహిళలకు రూ.2,500, పెంచిన పింఛన్‌, నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలు కాలేదని ప్రజలకు వివరించారు. మైనార్టీ సంక్షేమాన్ని కేవలం కేసీఆర్ మాత్రమే అందించారని భారాస ప్రచారం చేసింది.

Also Read: BR Naidu: టీటీడీ చైర్మన్‌గా ఏడాది పూర్తి చేసుకున్న బీఆర్ నాయుడు

భాజపా ప్రయత్నాలు: ముక్కోణపు పోటీలో తమ మనుగడను చాటుకోవడానికి భాజపా పోటీ పడింది. అభ్యర్థి ప్రకటన ఆలస్యమైనా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చురుకుగా ప్రచారం నిర్వహించి, అన్ని డివిజన్లలో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భారాస, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనంటూ ఆరోపణలు గుప్పించారు.

బస్తీ ఓటర్లే కీలకం; వ్యూహంలో మార్పు
ప్రచారం చివరి దశలో మూడు ప్రధాన పార్టీలూ తమ వ్యూహాన్ని మార్చుకుని, బస్తీల్లోని ఓటర్లపై దృష్టి సారించాయి. ముఖ్యంగా బోరబండ, రహ్మత్‌నగర్ డివిజన్లలోని దిగువ మధ్య తరగతి ఓటర్ల మద్దతు కీలకంగా మారింది. ఈ రెండు డివిజన్ల పరిధిలో సుమారు 1.10 లక్షల ఓట్లు ఉన్నట్లు అంచనా. ఓటర్ల జాబితా నుంచి పేర్లను విడిగా తయారుచేసి, కీలక నాయకులకు ఓటర్ల బాధ్యతలను అప్పగించడం ద్వారా పార్టీలు తమ పట్టును పెంచుకునే ప్రయత్నం చేశాయి.

పోలింగ్ ఏర్పాట్లు, భద్రత
ప్రచారం ముగిసిన వెంటనే నియోజకవర్గ పరిధిలో ఆంక్షలు అమలులోకి వచ్చాయి. 4 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్‌లో పోలింగ్ కోసం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 226 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, అక్కడ రెండంచెల భద్రత కల్పించారు. పారామిలిటరీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయగా, 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా రెండు రోజులపాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. అలాగే, సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గ పరిధిని వదిలి వెళ్లాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *