Jubilee Hills By-Poll: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికకు పోలింగ్ రేపు (మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా శ్రమించగా, ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో తేలాల్సి ఉంది.
ఎన్నికల బరిలో అభ్యర్థులు, ఓటర్ల సంఖ్య
ఈ ఉపఎన్నికలో మొత్తం 4 లక్షల 1,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.ఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలోని 139 ప్రాంతాల్లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో నాలుగు ఈవీఎంలను ఉంచారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.
ఇది కూడా చదవండి: Andessri: అందెశ్రీ మృతి.. చంద్రబాబు, లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి..
భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 5,000 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 1,761 మంది స్థానిక పోలీసులు మరియు 800 మంది కేంద్ర బలగాలు మోహరించనున్నాయి. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ విధించారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతను మరింత పెంచారు.
ఈ ఉపఎన్నికలో తొలిసారిగా పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టనున్నారు. 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని తరలించే ప్రక్రియ మొదలైంది. రేపు పోలింగ్ ముగిసిన తర్వాత, నవంబర్ 14న ఇదే స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఓటర్ స్లిప్పులపై పార్టీ గుర్తులను ముద్రించి పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

