Jubilee Hills By-Election: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ప్రారంభ రౌండ్లలో తన పట్టును ప్రదర్శిస్తూ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
తొలి మూడు రౌండ్లలో కాంగ్రెస్ రెండు రౌండ్లలో ఆధిపత్యం
పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్‌లోనే 3 ఓట్ల స్వల్ప ఆధిక్యం సాధించిన కాంగ్రెస్, మొదటి రెండు రౌండ్‌లలో తన జోరును కొనసాగించింది. కాగా, మూడో రౌండ్‌లో మాత్రం బీఆర్ఎస్ కొంత పుంజుకుని 211 ఓట్ల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది. అయినప్పటికీ, తొలి మూడు రౌండ్‌లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ 3,400 ఓట్లకు పైగా స్థిరమైన ఆధిక్యంలో నిలిచింది.
నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ భారీ విజృంభణ
ఎట్టకేలకు స్వల్ప ఆధిక్యం సాధించి ఉత్సాహంగా ఉన్న బీఆర్ఎస్‌కు.. నాలుగో రౌండ్ ఫలితాలు గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. కాంగ్రెస్ పార్టీ ఈ రౌండ్‌లో ఊహించని మెజారిటీని నమోదు చేసింది.నాలుగో రౌండ్‌లో ఆధిక్యం..కాంగ్రెస్ పార్టీ ఏకంగా 3,100 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించింది.
ఇది కూడా చదవండి: BBC: వీడియో తెచ్చిన తిప్పలు.. ట్రంప్‌కి క్షమాపణలు చెప్పిన బీబీసీ..
దీంతో, తొలి మూడు రౌండ్‌లలో ఉన్న 3,400 ఓట్ల ఆధిక్యానికి ఈ 3,100 ఓట్లు జతకావడంతో, కాంగ్రెస్ పార్టీ నాలుగో రౌండ్లు ముగిసేసరికి 9,100 ఆధిక్యంతో ఉంది.
బీఆర్ఎస్‌కు సవాల్: ట్రెండ్‌ను మార్చడం కష్టమేనా?
మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దూసుకుపోతుండటం, నాలుగో రౌండ్‌లో ఏకంగా 3 వేల ఓట్లకు పైగా ఆధిక్యం లభించడంతో.. ఇక జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం దిశగా ప్రయాణం స్పష్టమైంది. మొత్తం పది రౌండ్లలో కౌంటింగ్ జరగనుండగా, కీలకమైన నాలుగు రౌండ్‌లు పూర్తయ్యేసరికి ఇంతటి భారీ ఆధిక్యం నమోదు కావడం బీఆర్ఎస్‌కు పెద్ద సవాల్‌గా మారింది. మిగిలిన ఆరు రౌండ్‌లలో ఈ ట్రెండ్‌ను బీఆర్ఎస్ ఎంతవరకు మార్చగలుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
