war 2 pre release event: సినీ రంగంలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వారసత్వం ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ‘వార్-2’ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘వార్-2’ సినిమాను తాను చేయడానికి ప్రధాన కారణం నిర్మాత ఆదిత్య చోప్రా అని ఎన్టీఆర్ అన్నారు. తన అభిమానులు గర్వపడేలా ఈ సినిమాను నిర్మిస్తానని ఆయన ఇచ్చిన మాట వల్లే తాను ఈ సినిమా చేశానని చెప్పారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో భాగం చేసినందుకు ఆదిత్య చోప్రాకు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ గురించి మాట్లాడుతూ, ఇద్దరు స్టార్ నటులను ఇంత గొప్పగా చూపించడం అద్భుతం అన్నారు. 25 ఏళ్ల క్రితం హృతిక్ రోషన్ డ్యాన్స్ చూసి తాను ముగ్దుడయ్యాయని చెప్పారు. హృతిక్ గొప్ప నటుడు, అలాగే భారతదేశంలో అత్యుత్తమ డ్యాన్సర్లలో ఒకరని కొనియాడారు. హృతిక్ తో కలిసి డ్యాన్స్ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు.

తన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, రామోజీరావు తనను ‘నిన్ను చూడాలని’ సినిమాతో పరిచయం చేశారని చెప్పారు. ఆ సినిమా ప్రారంభోత్సవానికి తన తండ్రి హరికృష్ణ, తల్లి శాలిని తప్ప ఎవరూ లేరని అన్నారు. ఆదోని నుంచి ముజీబ్ అనే అభిమాని తనను మొదట కలిశాడని, అప్పటి నుంచి 25 ఏళ్లుగా తన అభిమానుల ప్రేమ పెరుగుతూనే ఉందని తెలిపారు. ఈ ప్రయాణానికి కారణమైన తన తల్లిదండ్రులు, అన్నలు కల్యాణ్ రామ్, జానకి రామ్, నిర్మాతలు, దర్శకులకు పాదాభివందనం చేశారు. తాను సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నప్పుడు ఇంటిని, పిల్లలను చూసుకుంటున్న తన భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్‌లకు ప్రేమను పంచుకున్నారు.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌ను గుర్తుపట్టని సెక్యూరిటీ.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
హృతిక్ రోషన్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తనకు తమ్ముడు లాంటివాడని అన్నారు. తెలుగు ప్రేక్షకులు తన సినిమాలైన ‘వార్’, ‘క్రిష్’, ‘ధూమ్ 2’లను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘వార్-2’ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని, గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. తాను బాధతో ఉన్నా, ఎన్టీఆర్ మాత్రం బాధను పంటి బిగువున పట్టుకుని సీన్స్ చేశారని, అది తనకు స్ఫూర్తిని ఇచ్చిందని హృతిక్ అన్నారు. ఎన్టీఆర్ ను ‘సింగిల్ టేక్ స్టార్’ అని పొగిడారు. నటుడిగా కాకుండా, ఎన్టీఆర్ లో గొప్ప చెఫ్ ఉన్నాడని, ఆయన చేతి వంట బిర్యానీ తినాలని ఉందని హృతిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా అదిరిపోయిందని, ఏ మాటలు నమ్మొద్దని, సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ అభిమానులను కోరారు.


