Jos Buttler: ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. మార్చి 1న దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని బట్లర్ ప్రకటించాడు. 2019 ప్రపంచ కప్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్లో ఇంగ్లాండ్ కనపర్చిన పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ అతను కెప్టెన్సీ పదవి నుండి పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇతనితోపాటు కోచ్ మెక్ కల్లం పైన కూడా ఎంతో ఒత్తిడి ఉంది.
జాస్ బట్లర్ కేవలం ఐసీసీ టోర్నమెంట్లే కాకుండా అంతకు ముందు జరిగిన మండే సిరీస్లలో కూడా ఇంగ్లాండ్ జట్టును విజయం వైపు నడిపించలేకపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు టీమ్ ఇండియాపై జరిగిన సిరీస్లలో వరుస ఓటముల కారణంగా అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజీలోనే ఇంగ్లాండ్ టోర్నీ నుంచి బయటపడిన సంగతి తెలిసిందే.
“జట్టు కోసం సరైన నిర్ణయం తీసుకున్నానని నేను భావిస్తున్నాను. కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో కలిసి మరో ఆటగాడు జట్టును ముందుకు నడిపిస్తాడు. నేను కేవలం కెప్టెన్సీ బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకుంటున్నాను. జట్టులో ఎప్పటిలానే కొనసాగుతాను. నా జీవితంలో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గర్వకారణంగా భావిస్తున్నాను” అని బట్లర్ తన భావాలను వ్యక్తం చేశాడు.
ఇది కూడా చదవండి: Champions trophy: వరుణుడి ప్రభావం – ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్ రద్దు
జోస్ బట్లర్ 2022 జూన్‌లో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. అదే సంవత్సరం టీ20 వరల్డ్ కప్‌లో జట్టుకు విజయాన్ని అందించాడు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొన్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌తో పాటు 2024 టీ20 వరల్డ్ కప్‌లోనూ జట్టు పేలవమైన ప్రదర్శననిచ్చింది.
ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే జోస్ బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. దీంతో ఇప్పుడు జట్టు కొత్త కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ పేరు చర్చల్లో ఉంది. అయితే బ్రూక్ చాలా యువ ప్లేయర్. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక అతను మినహాయించి ఇంగ్లాండు జట్టుకు మరొక ప్రత్యామ్యాయం లేకపోవడం వారి దయనీయ స్థితికి ప్రతీక అనే చెప్పాలి.