ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ జో రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్( WTC) చరిత్రలో రూట్ 5000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న పాకిస్థాన్ మొదటి టెస్టు మ్యాచ్ లో రూట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన రూట్, 27 పరుగులు చేయడంతో డబ్ల్యూటీసీలో 5 వేల పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రూట్ తర్వాత మార్నస్ లాబుషాగ్నే( 45 టెస్టుల్లో 3904 పరుగులు), స్టీవ్ స్మిత్( 45 టెస్టుల్లో 3486 పరుగులు), బెన్ స్టోక్స్( 48 టెస్టుల్లో 3101 పరుగులు), బాబర్ ఆజం(32 టెస్టుల్లో 2755 పరుగులు)లు ఉన్నారు.
ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ బ్యాట్స్ మెన్లలో అబ్దుల్లా షఫీక్(102), షాన్ మసూద్(151), సల్మాన్ అఘా(104 నాటౌట్) శతకాలతో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 3 వికెట్లు పడగొట్టాడు. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవరల్లో వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(64), జో రూట్(32) ఉన్నారు.