Jeevan Reddy

Jeevan Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఈ నెల 25న జీవన్ రెడ్డి రాజీనామా!

Jeevan Reddy: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న టి. జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని తన కార్యకర్తలకు, అభిమానులకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 25వ తేదీన పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ఆ లేఖలో స్పష్టం చేశారు.

తీవ్ర మనస్తాపంలో జీవన్ రెడ్డి:
గత 20 నెలలుగా తాను పార్టీలో తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తున్నానని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా ఎదురవుతున్న అవమానాలను భరిస్తూ పార్టీలో కొనసాగడం ఇక తన వల్ల కాదని ఆయన స్పష్టంగా చెప్పారు. సీనియర్ నాయకుడిగా ఉన్నప్పటికీ పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం, స్థానిక రాజకీయ పరిణామాల వల్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

కార్యకర్తల అభిప్రాయమే ముఖ్యం:
రాజీనామా తర్వాత తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందనేది త్వరలోనే వెల్లడిస్తానని జీవన్ రెడ్డి తెలిపారు. దీనికోసం స్థానిక నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే తన తదుపరి అడుగు వేస్తానని చెప్పారు. “నా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మీ తోడు, మార్గదర్శనం నాకు ఎప్పుడూ కావాలి” అని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన కోరారు.

రాష్ట్ర రాజకీయాల్లో చర్చ:
కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలంగా నమ్మకమైన నేతగా ఉన్న జీవన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన రాజీనామా చేస్తే జగిత్యాల ప్రాంతంలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం అధికార పార్టీలో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *