Jeevan reddy: బీసీల రిజర్వేషన్ల అంశంపై అనవసర రాద్ధాంతం మానుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు రాజకీయం చేయడం తగదని ఆయన హితవు పలికారు.
ఈ రిజర్వేషన్ బిల్లు అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో మార్చి 2025లో శాసనసభలో ఆమోదం పొందిందని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల పరిధిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఇది చట్టబద్ధంగా ముందుకొచ్చిన చర్య అని వివరించారు. అయితే, ఈ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చడంలో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేశారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటాలో, 4 శాతం రిజర్వేషన్లు పొందలేని వారు అర్హులవుతారని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయంగా, మతపరంగా రంగు పులిమి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఆపాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను అమలు చేయడానికి పంచాయతీరాజ్ చట్టం-2018లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించిందని వెల్లడించారు. దీనిపై బీసీ కమిషన్ మేధావులతో చర్చలు జరుపుతోందని, న్యాయపరమైన సవాళ్లను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఈ నిర్ణయం సామాజిక న్యాయాన్ని సాధించాలనే లక్ష్యంతో తీసుకున్న చారిత్రక చర్య అని అభివర్ణించిన జీవన్ రెడ్డి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దీనిపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు.