JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance), ఆయన సతీమణి ఉషా వాన్స్ (Usha Vance), ముగ్గురు పిల్లలు ఈవాన్, వివేక్, మిరాబెల్‌తో కలిసి నేడు భారత్‌కు పర్యటనకు రానున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు వారు ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్‌లో దిగనున్నారు. ఇది ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ చేపట్టిన తర్వాత భారతదేశానికి వారి తొలి పర్యటన కావడం విశేషం.
వాన్స్ కుటుంబం నాలుగు రోజులపాటు దేశంలో పర్యటించనున్నారు. ఢిల్లీ, జైపూర్, ఆగ్రా వంటి ప్రాంతాలను సందర్శించనున్నారు. కుటుంబం వ్యక్తిగత పర్యటనకే వచ్చినప్పటికీ, అధికారిక ప్రోటోకాల్స్ కచ్చితంగా అమలు చేయబడుతున్నాయి. వారి వెంట విదేశాంగ శాఖకు చెందిన ఐదుగురు సీనియర్ అధికారులు ఉన్నారు.
అత్యున్నత భద్రతా పాటిస్తూ ఢిల్లీలో ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ప్రధాన వీధులు, పర్యటన ప్రాంతాలు, ముఖ్యమైన ఆలయాల్లో భద్రతా బలగాలు మొహరించబడ్డాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా స్పెషల్ రూట్ మ్యాప్ ఆధారంగా ముందస్తు ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: Padma Awards 2025: 139 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు.. సమయం..తేదీ ఖరారు
ప్రధాని మోదీతో భేటీ, విందు
సాయంత్రం 6:30 గంటలకు జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. వీటిలో వాణిజ్య ఒప్పందాలు, భద్రత, ఆర్థిక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. చర్చల అనంతరం వాన్స్ దంపతులకు మోదీ విందు ఏర్పాటు చేశారు. ఈ భేటీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా పాల్గొంటారు.
JD Vance: విమానాశ్రయంలో స్వాగతం అనంతరం వాన్స్ కుటుంబం స్వామినారాయణ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయం పరిసరాల్లో ముందుగానే సెక్యూరిటీ ఏర్పాటు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్షర్ధామ్‌లో సంప్రదాయ భారతీయ కళలు, కౌశల్యాల విక్రయ కేంద్రాల సందర్శన కూడా వారి షెడ్యూల్‌లో ఉంది.
పర్యటనలో భాగంగా జైపూర్‌లో రాజస్థానీ కళలు, సంప్రదాయ రాజభవన సందర్శనలతో పాటు, ఆగ్రాలో తాజ్ మహల్‌ను కూడా వీరు సందర్శించే అవకాశముంది. ఉషా వాన్స్‌కు తెలుగు మూలాలు ఉండటంతో, వారి పర్యటనలో భారత సంస్కృతి పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని అధికారులు భావిస్తున్నారు.