JD Vance: ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి వల్ల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ, భారత్ జాగ్రత్తగా స్పందించాలని సూచించారు.
వాన్స్ మాట్లాడుతూ, “పర్యాటకులపై జరిగిన ఈ దాడి చాలా దుర్మార్గమైనది. అయితే భారత ప్రభుత్వం ఇది పెద్ద స్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీయకుండా వ్యవహరిస్తుందని మేం ఆశిస్తున్నాం,” అని అన్నారు. పాకిస్థాన్ కూడా ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. భారత్ ఉగ్రవాద మూలాలను నిర్మూలించేందుకు చేపడుతున్న చర్యలకు పాక్ సహకరించాల్సిన అవసరం ఉందని వాన్స్ తెలిపారు.
ఈ వ్యాఖ్యలు వాన్స్ భార్యతో కలిసి భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో వెలువడ్డాయి. పహల్గాం దాడి జరిగిన సమయంలో ఆయన భారతదేశంలోనే ఉన్నారు. దాడిని తీవ్రంగా ఖండించిన వాన్స్, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా అన్ని విధాలుగా సహాయపడుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు అనేక అంతర్జాతీయ నాయకులు ఈ ఘటనను ఖండిస్తూ భారత్‌కు మద్దతు ప్రకటించారు.
Also Read: Amaravati: పది ఏళ్ల నిరీక్షణకి ముగింపు.. అమరావతికి పునర్వైభవం
JD Vance: ఇక మరోవైపు పాక్ సైన్యం నియంత్రణ రేఖ వద్ద మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, నౌషెరా, అఖ్నూర్ ప్రాంతాల్లో పాక్ దళాలు గర్జించాయి. భారత ఆర్మీ అయితే ధైర్యంగా ఎదుర్కొని కౌంటర్ ఫైర్ చేసింది. గత కొద్ది రోజుల్లో ఇలాంటి ఉల్లంఘనలు ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం.
ఈ పరిణామాలతో భారత్-పాకిస్థాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉగ్రవాదం వ్యతిరేకంగా సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది అనే అభిప్రాయం అంతర్జాతీయ వేదికలపై వ్యక్తమవుతోంది.