Jd vance: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు రష్యాపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా భారత్‌పై భారీ సుంకాలు విధించామని అమెరికా స్పష్టం చేసింది. ఈ చర్య ద్వారా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడం తమ వ్యూహాత్మక లక్ష్యమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.
ఎన్‌బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ, “రష్యా తన చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ ద్వారా లాభపడకుండా కట్టడి చేసేందుకే అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై కఠిన ఆర్థిక చర్యలు తీసుకున్నారు. రష్యా ఉక్రెయిన్‌లో మారణహోమాన్ని ఆపితేనే తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఆహ్వానిస్తాం” అని స్పష్టం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఇటీవల ఇరు దేశాల నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి.
ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం – సుంకాల పెంపు
రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై సుంకాలను 50% వరకు పెంచింది. అదనంగా రష్యా చమురు దిగుమతులపై 25% సుంకం విధించారు.
అమెరికా ఆరోపణల ప్రకారం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ పరోక్షంగా యుద్ధానికి ఆర్థిక మద్దతు ఇస్తోందని అంటోంది. అయితే భారత్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది
భారత్ ఘాటైన కౌంటర్
ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ అంశంపై స్పందిస్తూ, “వ్యాపార అనుకూల ప్రభుత్వం అని చెప్పుకునే అమెరికా, ఇతరులు వ్యాపారం చేస్తుంటే ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరం. మీకు మా నుంచి చమురు లేదా శుద్ధి చేసిన ఉత్పత్తులు కొనడంలో సమస్య ఉంటే కొనకండి. మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు” అని గట్టి సమాధానం ఇచ్చారు.