Jayaprakash: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో గర్వకారణమైన గుర్తింపు లభించింది. విశాఖపట్నంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్ ఏర్పాటు నిర్ణయంపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చొరవతో రాష్ట్రం దేశంలో డిజిటల్ విప్లవానికి ముందడుగు వేసిందని ఆయన అభినందించారు.
“వైజాగ్‌లో గూగుల్ హబ్ స్థాపన కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా, మొత్తం భారత డిజిటల్ మౌలిక వసతుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుంది” అని జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. ఈ చారిత్రక ఒప్పందాన్ని సాకారం చేయడంలో సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అదే సమయంలో, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై జేపీ కీలక సూచనలు చేశారు. పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాలు నిర్మించడం ఎంత ముఖ్యమో, ఆర్థిక క్రమశిక్షణను పాటించడం అంతే అవసరమని ఆయన గుర్తుచేశారు.
“ప్రస్తుత రెవెన్యూ వ్యయాన్ని కొన్నేళ్ల పాటు నియంత్రించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఆర్థిక వ్యవస్థ విస్తరించడంతో పన్నుల ఆదాయం పెరుగుతుంది. అప్పుడు అనవసర ఖర్చులను తగ్గిస్తే ప్రజా అప్పులను సులభంగా నియంత్రించవచ్చు” అని ఆయన సూచించారు.
ప్రస్తుతం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)తో పోలిస్తే బడ్జెట్‌యేతర రుణాలు, చెల్లించని బిల్లులు కలిపి అప్పు నిష్పత్తి 60 శాతం దాటిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ పరిస్థితి భవిష్యత్తుకు ప్రమాదకరం. పెట్టుబడుల సేకరణలో చూపిన చొరవను, ఆర్థిక నిర్వహణలో కూడా ప్రభుత్వం కొనసాగించాలి” అని జయప్రకాశ్ నారాయణ పిలుపునిచ్చారు.