Jasprit Bumrah: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కేవలం మూడు టెస్టులు ఆడిన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, వచ్చే నెల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగే ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో ఆడనున్నాడు. పనిభారం నిర్వహణలో భాగంగా వెస్టిండీస్‌తో అక్టోబర్‌లో జరిగే టెస్ట్ సిరీస్‌లోని తొలి టెస్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. భారత ఆటగాళ్ల ఆరోగ్య నివేదికలు వచ్చిన తర్వాత, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఆగస్టు 19 లేదా 20న జట్టు ఎంపికపై చర్చించేందుకు సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ఆసియా కప్ కోసం భారత జట్టును ఎంపిక చేయనున్నారు.
ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో వైస్ కెప్టెన్సీ కోసం శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా రాణించిన శుభ్‌మన్ గిల్ ఈ రేసులో ముందున్నాడు. అయితే, అక్షర్ పటేల్ ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో ఈ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా పనిచేశాడు.
భారత బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లకు చోటు దక్కవచ్చు. అభిషేక్ శర్మ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బ్యాటర్‌గా ఉన్నాడు. సంజు శాంసన్ బ్యాటర్, వికెట్ కీపర్‌గా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సెలెక్టర్లకు ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉండడం ఇప్పుడు తలనొప్పిగా మారింది. అయితే, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ లాంటి యువ క్రికెటర్లకు ప్రస్తుత జట్టులో చోటు దొరకడం కష్టంగానే ఉంది. వన్డేల్లో ప్రధాన కీపర్ అయిన కేఎల్ రాహుల్‌కు కూడా స్థానం అనుమానమే. కీపర్‌గా సంజు శాంసన్ ఖాయం. రెండో కీపర్‌గా జితేశ్ శర్మ లేదా ధ్రువ్ జురెల్‌కు అవకాశం దక్కనుంది.
Also Read: Musheer Khan: యువ క్రికెటర్ సంచలనం.. సెంచరీతో పాటు పదివికెట్లు!
బౌలింగ్ విభాగంలో పోటీ
ఆల్-రౌండర్లు: పేస్ ఆల్-రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉన్నాడు. స్పిన్ ఆల్-రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ జట్టులో స్థానం దక్కించుకునే అవకాశాలున్నాయి. గాయంతో బాధపడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చే అవకాశం లేదు.
ఫాస్ట్ బౌలర్లు: జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్ ఆడడం దాదాపు ఖాయం. ఐపీఎల్-18లో 25 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ, టీమిండియాలో మూడో ఫాస్ట్ బౌలర్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హర్షిత్ రాణాకు అవకాశం లభించడం కష్టంగానే ఉంది.
ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది, ఇది వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్‌కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. భారత్ గత ఆసియా కప్‌ను గెలుచుకుంది, ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తోంది.