Janasena:తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ క్రియాశీలకం కానున్నది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల గోదాలోకి అడుగుపెట్టనున్నది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార కూటమిలో ఉన్న జనసేన తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు తాజాగా వచ్చిన ప్రకటనతో తన నిర్ణయాన్ని ప్రకటించింది. జనసేన తెలంగాణ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పేరిట ప్రకటన వెలువడటంతో ఆ పార్టీ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.
Janasena:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ పెను సంచనలంగా మారింది. పార్టీ ఆరంభం తర్వాత అపజయాలు చవిచూసినా మొక్కవోని దీక్షతో 2019 నుంచి 2024 వరకు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్, ఆ పార్టీ శ్రేణులు వీరోచిత పోరాటం కొనసాగించారు. ప్రజావ్యతిరేక విధానాలపై, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వైఖరిని ఎండగడుతూ ప్రజల్లో క్రేజీ సంపాదించారు.
Janasena:ఆనాడు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో, మరో పక్షమైన బీజేపీతో జట్టుగట్టి, విపక్షాల ఓట్లు చీలకుండా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తాను సీట్టు తగ్గించుకొని ఇతరులకు అధిక సీట్లు ఇచ్చి అయినా వైసీపీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగారు. దీంతో 2024 ఎన్నికల్లో వైసీపీని మట్టికరిపించి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించడంలో పవన్‌కల్యాణ్ క్రియాశీలక పాత్ర పోషించారనడంతో అతిశయోక్తి లేదు.
Janasena:ఆ తర్వాత కూటమి అధికారంలోకి రాగానే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. పాలనలో కూడా ప్రత్యేకతను చాటుతూ ముందుకు సాగుతున్నారు. కూటమిలో ఐక్యతను కొనసాగిస్తూ సంయమనంతో వ్యవహరిస్తున్నారు. దీంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ప్రత్యేక సహకారంతో మరిన్ని నిధులను రాబట్టడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
Janasena:ఈ దశలో తెలంగాణలో పోటీకి సిద్ధంగా ఉన్నట్టు జనసేన ప్రకటన రావడంతో అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల్లో కాస్త వణుకు పుట్టినట్టయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా ప్రస్తుతం ద్విముఖ పోటీ నెలకొని ఉన్నది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కొన్నిచోట్ల త్రిముఖ పోటీ ఉన్నా, రానురాను అది ద్విముఖ పోటీకి దారితీసింది.
Janasena:ఈ నేపథ్యంలో మళ్లీ జనసేన ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటన వెలువడటంతో మళ్లీ రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇక్కడ క్రియాశీలకంగానే ఉన్న బీజేపీతో కలుస్తారా? ఒంటరిగానే పోటీ చేస్తారా? అన్నది తేలాల్సి ఉన్నది. రాష్ట్రంలో ప్రధానంగా పట్టణాల్లో బీజేపీకి బలమైన క్యాడర్ ఉన్నది. దానికి జనసేన క్యాడర్ తోడైతే అటు అధికార పక్షాన్ని, ఇటు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను ఢీకొనే అవకాశం లేకపోలేదు.
Janasena:ఇదే దశలో కాస్త స్తబ్దుగా ఉన్న బీజేపీకి జీవం పోసినట్టవుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మూడింట ఒక వంతు స్థానాలను గెలుచుకొని గట్టిపోటీ ఇచ్చింది. బీజేపీ మూడంకెల స్థానాలకే పరిమితమై చతికిలపడినట్టయింది. ఈ దశలో బీజేపీ, జనసేన కూటమి కడితే బీఆర్ఎస్‌ను వెనక్కి నెడుతాయా? అధికార పార్టీని ఢీకొడుతాయా? లేదా చతికిలిపడతాయా? అన్నది తేలాల్సి ఉన్నది.
