Janasena Counter To Kavitha: తెలంగాణ రాజకీయ రంగస్థలంలో కొత్త డ్రామా మొదలైంది! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, జగన్‌ను ఆకాశానికి ఎత్తేసి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై తన ద్వేషాన్ని బయటపెట్టుకున్నారు. కానీ, జనసేన నుండి వచ్చిన కౌంటర్‌లు మాత్రం కవితను కంగు తినిపించాయి. కవితకు జగన్‌తో బాండింగ్, బాబుపై ద్వేషం, అలాగే పవన్‌పై ఆమె చేసిన విమర్శల్ని ఎలా చూడాలి? అసలు ఈ వివాదం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ స్టోరీలో ట్విస్ట్‌లు చాలానే ఉన్నాయ్. లెట్స్ వాచ్.
రాజకీయాల్లో సారూప్యతలు చాలా వింతగా కనిపిస్తాయి. అటువంటి సిమిలారిటీసే ఇప్పుడు కల్వకుంట్ల, వైఎస్ కుటుంబాల మధ్య కనిపిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. జగన్ మంచి ఫైటర్ అని, ప్రతిపక్ష నాయకుడిగా గొప్ప పోరాటం చేస్తున్నారని కీర్తించారు. కానీ జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం, బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో ఎక్కువ సమయం గడుపుతుండటం చూసి ఆంధ్రా ప్రజలకు జగన్ ఎంత గొప్ప ఫైటరో అర్థం అవుతూనే ఉంది. అనర్హత వేటు నుండి తప్పించుకోవడానికి ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చి, మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారాయన. వాస్తవానికి బీఆర్ఎస్, వైసీపీ మధ్య గత ఐదేళ్లుగా సఖ్యత ఉంది.
మంచి సత్సంబంధాలూ ఉన్నాయ్. కేసీఆర్ సూచనలను జగన్ పాటించిన సందర్భాలు కూడా ఉన్నాయన్న మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు… తమ పాలనలో సాగించిన లొసుగుల కారణంగా రాబోయే రెండు మూడేళ్లలో అవినీతి కేసులను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే కవిత, జగన్‌పై ఈడీ కేసులు ఉన్నాయి. కేటీఆర్ కూడా రీసెంట్‌గా కొన్ని కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఈ సారూప్యతల వల్లే కవితకు జగన్ ఇన్‌స్పిరేషన్‌గా కనిపిస్తున్నారేమో! కానీ కవిత పొగడ్తలను “స్కాముల సౌరభం” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎంతైనా… ఒకే జాతి పక్షులు ఏనాటికైనా ఒకే గూటికి చేరాల్సిందే కదా.
కల్వకుంట్ల కుటుంబం జగన్‌ను మిత్రుడిగా, చంద్రబాబును శత్రువుగా చూస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇట్స్ క్లియర్. కవిత, జగన్‌ను “అలుపెరుగని యోధుడు” అని కొనియాడిన సందర్భంలోనే… చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై తన ద్వేషాన్ని బయటపెట్టుకున్నారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర నాయకులు తెలంగాణపై ఆధిపత్యం చెలాయించారన్న గతం నుండీ కూడా…. కేసీఆర్ వర్గం బాబును ద్వేషిస్తూనే ఉంది. అయితే రాష్ట్రం విడిపోయాక, ఒకానొక సందర్భంలో చంద్రబాబు తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేయాలని చూసినా, ఏపీ బాధ్యతలతో అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం చంద్రబాబు తెలంగాణలోనూ తన పార్టీ ఉందన్న సంగతే మర్చిపోయినట్లున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad Metro Expansion: ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ.. 40 కి.మీ. మేర మెట్రో విస్తరణ
కానీ, కల్వకుంట్ల కుటుంబం మాత్రం ఏపీ రాజకీయాల్లో తలదూర్చుతూనే ఉంది. తెలంగాణాను దోచుకునే బూచిగా చంద్రబాబును చూపించే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది. తెలంగాణకు దిగువన ఉన్న ఆంధ్రా… కృష్ణా, గోదావరి నీళ్లను తస్కరిస్తోందంటూ కేసీఆర్ విచిత్రంగా ఆరోపిస్తుంటారు. అయినా, చంద్రబాబు ఈ ఆరోపణలను పట్టించుకోరు. కౌంటర్ విమర్శలు చేసిన సందర్భాలు కూడా లేవు. ఇక 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి పరోక్షంగానైనా ఎంతో కొంత కారణమైన చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్, దాని ఎఫెక్ట్‌ను సహజంగానే కల్వకుంట్ల కుటుంబం జీర్ణించుకోలేక పోతున్నట్లుంది. ఇక పవన్ కళ్యాణ్‌ను ఊహించని విజయం సాధించడం, బీజేపీతో గట్టి సంబంధాలు కలిగి ఉండటం, దేశ్ కీ నేత అనుకుంటూ వెళ్లి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బొక్కబోర్లా పడితే… పవన్ పరపతి మాత్రం దేశ రాజకీయాల్లో పెరుగుతూ ఉండటం… పవన్‌పై ద్వేషానికి కారణాలు అయి ఉండొచ్చని పరిశీలకుల అభిప్రాయం.
పవన్ దురదృష్టవశాత్తూ డిప్యూటీ సీఎం అయ్యారనీ, ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదనీ పేర్కొన్న కవిత… అలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2014లోనే కవిత పవన్‌ను “రాజకీయ బ్రహ్మానందం” అని వ్యాఖ్యానించారు. సరే… అదేమీ బూతు కాదు కాబట్టి, రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు, సూటిపోటి మాటలు సహజం అనుకోవచ్చు. కానీ తాజా పాడ్‌కాస్ట్‌లో కవిత.. పవన్‌కు విశ్వసనీయత లేదని, హిందీ భాష అంశంలో ఆయన స్టాండ్ దారుణమని ఆరోపించారు. అయితే కవిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన స్పందన మాత్రం.. ఆమెకున్న అవగాహన ఎంతో బయటపెడుతోంది.
పవన్ హిందీని రుద్దడాన్ని ఎప్పుడూ సమర్థించలేదని, కొత్త భాషలు నేర్చుకోవడం మనుగడకు అవసరమని సూచించారని.. ఓ వీడియో ద్వారా స్పష్టం చేసింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కవిత ఎలా వక్రీకరించారో పబ్లిక్ ముందు పెట్టింది. పవన్ రాజకీయ ప్రయాణాన్ని, సామాజిక సంస్కరణలను కవిత తప్పుగా అర్థం చేసుకున్నారన్న జనసేన పార్టీ… ఆమె వ్యాఖ్యలను “విదూషకత్వం”గా చిత్రీకరించింది. విదూషకులు అంటే ఎవరో అనుకునేరు… అచ్చ తెలుగు బాషలో చెప్పాలంటే హాస్య నటులు అని, అదే ఇంగ్లీష్‌లో చెప్పాలంటే జోకర్స్ అని అర్థం. అంటే.. ఒక్క వర్డ్‌లో కవితకు సెటైరికల్ కౌంటర్ ఇచ్చిన జనసేన, ఆమెను తేలిగ్గా తీసిపడేసినట్లు అర్థమౌతోంది. మరి కవిత ఇమేజ్‌కి అయిన డ్యామేజ్‌ని బీఆర్‌ఎస్ ఇప్పుడు ఎలా పూడ్చుకుంటుందో వేచి చూడాలి.