MLA Arava Sridhar: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఒక మహిళ చేసిన ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ తన విచారణను పూర్తి చేసింది. గత కొన్ని రోజులుగా ఎవరికీ కనిపించకుండా ఉన్న ఎమ్మెల్యే, పార్టీ ఆదేశాల మేరకు కమిటీ ముందుకు వచ్చి తన వెర్షన్‌ను వినిపించారు.
శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవిలతో కూడిన త్రిసభ్య కమిటీ మంగళవారం రైల్వే కోడూరుకు చేరుకుంది. దాదాపు గంటన్నర పాటు ఎమ్మెల్యేను క్షుణ్ణంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని వాదిస్తూ, తన దగ్గర ఉన్న కొన్ని ఆధారాలను శ్రీధర్ కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆధారాల్లో ఏముంది? ఆయన ఇచ్చిన వివరణ ఏమిటి? అనే విషయాలను మాత్రం కమిటీ ప్రస్తుతానికి రహస్యంగా ఉంచింది.
మరోవైపు, ఆరోపణలు చేసిన మహిళ వరుసగా వీడియోలు విడుదల చేస్తూ ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచుతోంది. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే అనుచరులు కూడా ఇది తమ నాయకుడిని బద్నాం చేసే కుట్ర అని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ నుంచే వీడియో కాల్స్ మాట్లాడారనే ఆరోపణలు రావడంతో పార్టీ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. అందుకే తొందరపడి చర్యలు తీసుకోకుండా, నిజా నిజాలు తెలుసుకోవడానికే ఈ కమిటీని రంగంలోకి దించింది.
ఇక ఇప్పుడు బంతి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోర్టులో ఉంది. కమిటీ సభ్యులు తమ నివేదికను నేరుగా ఆయనకే అందజేయనున్నారు. ఎమ్మెల్యే సమర్పించిన ఆధారాలు ఎంతవరకు నిజం? మహిళ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? అనే అంశాలను పరిశీలించిన తర్వాతే జనసేనాని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నివేదిక ఆధారంగానే శ్రీధర్ పార్టీలో కొనసాగుతారా లేదా అనే విషయంపై స్పష్టత రానుంది.
