Jana nayagan: తమిళ సినీ హీరో విజయ్ నటించిన భారీ చిత్రమైన ‘జన నాయగన్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సర్టిఫికేట్ రావడంలో ఆలస్యం కావడంతో విడుదల తేదీని అకస్మాత్తుగా వాయిదా వేయాల్సి వచ్చింది. ముందే బుక్‌మైషో వంటి ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో బుకింగ్స్ ప్రారంభం కావడంతో లక్షలాది అభిమానులు ఉత్కంఠగా టికెట్లు కొనుగోలు చేసి థియేటర్లలో సినిమా చూడటానికి సిద్ధమయ్యారు.
అయితే విడుదల ఆగిపోవడంతో ప్రేక్షకులకు నిరాశను కలిగించడమే కాకుండా, బుక్‌మైషో సంస్థకు కూడా మునుపెన్నడూ రాని ఆర్థిక భారాన్ని తెచ్చింది. సాధారణంగా సినిమా వాయిదా పడితే వందల నుంచి వేల టికెట్లే రద్దవుతాయి, కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారి ఏకంగా నాలుగు లక్షలయాభై వేల టికెట్లు ఒకేసారి క్యాన్సిల్ అయ్యాయి. ఈ భారీ సంఖ్య భారతీయ సినీ చరిత్రలో రికార్డు స్థాయిలో నిలిచింది. రీఫండ్ కోసం వేలమంది ప్రేక్షకులు ఒత్తిడి తేవడంతో, బుక్‌మైషో మరియు డిస్ట్రిబ్యూటర్లు కలిసి వెంటనే రీఫండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
టికెట్ బుక్ చేసినవారు ఏ చెల్లింపు విధానాన్ని ఉపయోగించారో—యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డు లేదా వాలెట్—అదే రూట్ ద్వారా 5 నుండి 7 పని రోజులలో డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయని బుక్‌మైషో ప్రకటించింది. ఈ ఘటన ఒక భారీ బడ్జెట్ చిత్రానికి, అలాగే ఆన్‌లైన్ బుకింగ్ సంస్థలకు కూడా విడుదల వాయిదాల వల్ల ఏర్పడే ప్రభావం ఎంత పెద్దదో మరోసారి స్పష్టమైంది.
