Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో భారత భద్రతా బలగాలకు మరో ఘనవిజయం లభించింది. సరిహద్దును దాటేందుకు ప్రయత్నించిన ఏడుగురు పాకిస్థాన్ జాతీయులను భారత సైన్యం మట్టుబెట్టింది. వీరిలో పాకిస్థాన్ సైనికులు ఇద్దరు లేదా ముగ్గురు ఉండొచ్చని భారత సైన్యం భావిస్తోంది.
ఫిబ్రవరి 5న, పాకిస్థాన్ ‘కశ్మీర్ సంఘీభావ దినం’ పాటిస్తున్న నేపథ్యంలో, ఉగ్రవాదులు భారత భూభాగంలో చొరబడేందుకు ప్రయత్నించారు. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్, కృష్ణాఘాటి వద్ద ఈ చొరబాటు యత్నాన్ని భారత జవాన్లు సమర్థంగా అడ్డుకున్నారు.
బీఏటీ ముఠా కాల్పులు – భారత సైన్యం దీటైన ప్రతిస్పందన
చొరబడే ప్రయత్నానికి సహాయపడేందుకు పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT) భారత సైన్యంపై కాల్పులు జరిపింది. ఒక భారత సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. అయితే, భారత సైన్యం అప్రమత్తంగా స్పందించి కాల్పులను తిప్పికొట్టడంతోపాటు, ఏడుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులను హతమాచ్చింది.
ఈ ఘటనలో హతమైనవారిలో పలువురు అల్ బదర్ ఉగ్రవాద గ్రూపుకు చెందినవారని సైన్యం అనుమానిస్తోంది. భారత భద్రతా బలగాలు సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఉంచడంతో, పాకిస్థాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థలు వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాయి.