UN: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (UNO) ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం బహిరంగ చర్చా సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ (Parvathaneni Harish) పాకిస్తాన్‌పై ఘాటుగా విమర్శలు గుప్పించారు.
హరీష్ స్పష్టంగా పేర్కొంటూ.. జమ్మూకాశ్మీర్ భారత్‌లో ఎల్లప్పుడూ అంతర్భాగమే, విడదీయరాని బంధంగా ఉంది ఎప్పటికీ అలాగే ఉంటుంది అని అన్నారు.
అదే సమయంలో పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను తీవ్రంగా ఖండించారు.
పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో ఉల్లంఘనలు
హరీష్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ సైనిక ఆక్రమణ, అణచివేత, క్రూరత్వం, వనరుల అక్రమ దోపిడీ కారణంగా అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న ఈ ఉల్లంఘనలను వెంటనే ఆపాలని ప్రపంచ సమాజం చర్యలు తీసుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.
వసుధైక కుటుంబం స్ఫూర్తితో భారత్
హరీష్ తన ప్రసంగంలో ‘వసుధైక కుటుంబం’ అనే భారతీయ తత్వాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశం ఎప్పుడూ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తుంది. అందరికీ న్యాయం, గౌరవం, శ్రేయస్సు లభించాలనే భావనతో మేము ముందుకు సాగుతున్నాం అని తెలిపారు.
అలాగే జమ్మూకాశ్మీర్ ప్రజలు ఇప్పుడు తమ ప్రాథమిక హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారని, అది పాకిస్తాన్‌కు మింగుడుపడని వాస్తవమని హరీష్ ఎద్దేవా చేశారు.
యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం & భాషలు
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికా న్యూయార్క్ నగరంలో ఉంది. అదనంగా జెనీవా, నైరోబి, వియన్నా, హేగ్ నగరాల్లో కూడా దాని శాఖలు ఉన్నాయి. యూఎన్‌కు మొత్తం ఆరు అధికార భాషలు ఉన్నాయి, అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. ఇందులో 1973లో అరబిక్ భాషను అదనంగా చేర్చారు.
భారత దౌత్య ధోరణి స్పష్టంగా
భారత ప్రతినిధి ప్రసంగం మరోసారి అంతర్జాతీయ వేదికపై భారత్ స్పష్టమైన దౌత్య ధోరణిని చాటింది. జమ్మూకాశ్మీర్ భారతదేశానికి విడదీయరాని భాగమని, పాకిస్తాన్ ఆధీనంలోని ప్రాంతాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను నిలిపివేయాలని ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు పర్వతనేని హరీష్.

