Jammu kashmir: జమ్ము కశ్మీర్‌లోని రంభన్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ కాన్వాయ్‌లో ఉన్న వాహనం 700 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఆర్మీ వాహనం జమ్ము నుంచి శ్రీనగర్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది. రంభన్ జిల్లాలోని వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, ఆర్మీ బృందాలు స్పందించి సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే ముగ్గురు జవాన్లు ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వాతావరణ పరిస్థితులు, రోడ్డు పరిస్థితి, డ్రైవింగ్‌కు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
సైన్యంలో సేవలు అందిస్తూ ప్రాణాలు అర్పించిన వీరజవాన్ల కుటుంబాలకు దేశం ఎల్లప్పుడూ ఋణపడి ఉంటుందని సైనిక అధికారులు నివాళులర్పించారు.