Varanasi: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్’ సృష్టికర్త జేమ్స్ కెమెరూన్ ఈ ప్రాజెక్టుపై తనకున్న ఆసక్తిని వెల్లడించడం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. తన తాజా చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళితో జరిగిన ముఖాముఖిలో కెమెరూన్ ‘వారణాసి’ సినిమా గురించి ప్రత్యేకంగా చర్చించారు. రాజమౌళి సృష్టించే మాయాజాలాన్ని దగ్గరుండి చూడాలని ఉందని, వీలైతే ‘వారణాసి’ సెట్స్‌కు వచ్చి సెకండ్ యూనిట్ కెమెరామెన్‌గా కొన్ని షాట్స్ తీస్తానని ఆయన కోరడం విశేషం.
భారతదేశం నుండి ఐమ్యాక్స్ (IMAX) వెర్షన్లో, ముఖ్యంగా 1.43:1 ఆస్పెక్ట్ రేషియోలో రూపొందుతున్న మొదటి సినిమాగా ‘వారణాసి’ సరికొత్త సాంకేతిక ప్రమాణాలను నెలకొల్పుతోంది. రాజమౌళి పనితీరును ఎంతో గౌరవించే జేమ్స్ కెమెరూన్, ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌కు ఆహ్వానించమని అడగడం రాజమౌళికి, మహేష్ బాబుకు దక్కిన అతిపెద్ద గౌరవంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంభాషణలో భాగంగా కెమెరూన్ సరదాగా స్పందిస్తూ, రాజమౌళి పులులతో ఏదైనా అడ్వెంచర్ చేస్తున్నప్పుడు తనకు కచ్చితంగా సమాచారం ఇవ్వాలని కోరడంతో ఇద్దరి మధ్య నవ్వులు పూశాయి. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో పులి సన్నివేశాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కెమెరూన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: Nidhhi Agerwal: అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బందిపడ్డ నిధి అగర్వాల్
అవతార్ మూడో భాగం ‘ఫైర్ అండ్ యాష్’ డిసెంబరు 19న విడుదల కానున్న నేపథ్యంలో, ఈ చిత్రాన్ని చూసిన మొదటి భారతీయుడిగా రాజమౌళికి అవకాశం లభించింది. సినిమా చూస్తున్నంత సేపు ఒక చిన్న పిల్లాడిలా అనుభూతి చెందానని రాజమౌళి తన సంతోషాన్ని కెమెరూన్తో పంచుకున్నారు. ప్రతిగా తన వంతు సహాయం ఏదైనా చేయాలని కోరుకున్న కెమెరూన్, నేరుగా రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణలో కెమెరా పట్టుకుంటానని అనడం సినిమా చరిత్రలో ఒక అరుదైన ఘట్టం. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడే స్వయంగా సెట్స్‌కు వస్తానని అనడం, అందులోనూ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రంపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమా దాదాపు ఒక సంవత్సరం షూటింగ్ పూర్తి చేసుకుందని, మరో ఎనిమిది నెలల పాటు చిత్రీకరణ కొనసాగుతుందని రాజమౌళి తాజా అప్డేట్ ఇచ్చారు.
Dear @JimCameron, we’d be honoured to host you on the #VARANASI sets sir. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/seIp1yXzYX
— Varanasi (@VaranasiMovie) December 17, 2025
