Jalimudi Project:ఖమ్మం జిల్లాలో జాలిమూడి ప్రాజెక్టులో మళ్లీ కదలిక వచ్చింది. జాలిమూడి కుడి, ఎడమ కాలువల మరమ్మతులకు డిప్యూటీ సీఎం, మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే అయి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో ప్రభుత్వం రూ.5.30 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో మధిర నియోజకవర్గానికి మహర్దశ పట్టనున్నది.
Jalimudi Project:2009 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క మధిర, బోనకల్లు మండలాల్లోని పంట పొలాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ఆనాడు సుమారు రూ.50 కోట్ల వ్యయం అంచనాతో జాలిమూడి ప్రాజెక్టును మంజూరు చేశారు. ఈ మేరకు ఆ నాడే పనులకు శ్రీకారం చుట్టారు. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కారు మూలన పడేసింది.
Jalimudi Project:తాజాగా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ జాలిమూడి ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. ఆ ప్రాంత రైతులు మల్లు భట్టి విక్రమార్కను కలిసి వివరించగా, తాజాగా ఆయన నిధుల మంజూరుకు చొరవ తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సుమారు 5000 ఎకరాలకు సాగునీరు అందనున్నది. నిధుల మంజూరుతో మధిర ప్రాంత రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.