Jagga Reddy

Jagga Reddy: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కుట్ర జరుగుతోంది.. ఏపీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్!

Jagga Reddy: విజయవాడ పర్యటనలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఆయన తప్పుబట్టారు. విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

ప్రధాని మోదీతో ఏపీ నేతలకు ఉన్న సంబంధాలను జగ్గారెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్‌లకు మోదీతో మంచి దోస్తీ ఉందని, అలాగే పవన్ కల్యాణ్ కూడా ప్రధానితో ఎంతో సన్నిహితంగా ఉంటారని ఆయన గుర్తు చేశారు. ఇంతటి పలుకుబడి ఉన్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోతున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలకులు మారినా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేకపోవడం వారి వైఫల్యమేనని విమర్శించారు.

గతంలో ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరిస్తున్న చంద్రబాబు, జగన్‌లకు ఈ విషయంపై మాట్లాడే అర్హత లేదని జగ్గారెడ్డి మండిపడ్డారు. తనకు కేవలం తెలంగాణ మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు రెండూ బాగుండాలన్నదే తన ఆకాంక్ష అని, అందుకే ఏపీ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నానని తెలిపారు.

రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ.. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూర్చుని సమస్యలను పరిష్కరించుకుంటారని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న జగన్, కేసీఆర్ ఎప్పుడైనా ప్రాజెక్టుల గురించి ఇలా చర్చలు జరిపారా? అని ఆయన నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *