Jagga Reddy : వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్టను పెంచితే, నేడు ప్రధాని మోదీ పాలనలో భారత్ అంతర్జాతీయ వేదికపై వెనుకబడుతోందని విమర్శించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని అన్నారు.
తెలంగాణలో 14, ఆంధ్రప్రదేశ్‌లో 20 లోకసభ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తే, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం వంటి కీలక అంశాలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు.
గత పదేళ్లుగా కేసీఆర్, జగన్, చంద్రబాబు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా, తమ రాష్ట్రాలకు నిధులు తెచ్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజీవ్ గాంధీ తీసుకున్న సంస్కరణల వల్లే దేశంలో ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాలు విప్లవాత్మకంగా ఎదిగాయని గుర్తు చేశారు. అలాగే యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం గ్రామీణులకు మేలు చేసిందని చెప్పారు.
మోదీ ఇచ్చిన నల్లధనం ప్రకటిస్తానన్న హామీ, ప్రతి ఖాతాలో ₹15 లక్షలు వేస్తానన్న మాట, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానం ఇంకా నెరవేరలేదని ఆయన ప్రశ్నించారు. మోదీ పాలనలో మహిళలకు ఉపాధి, యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ ప్రజలు మళ్లీ మోసపోవద్దని, 300 లోకసభ స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని జగ్గారెడ్డి కోరారు. మాట ఇచ్చి నిలబెట్టుకునే వ్యక్తి రాహుల్ గాంధీ అనే వ్యాఖ్యతో ఆయన ప్రసంగం ముగించారు.

