AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలు కీలక అరెస్టులు జరగగా, తాజాగా మరోసారి ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో కేసులో నిందితుల సంఖ్య 48కి చేరింది.
శనివారం హైకోర్టు, సుప్రీంకోర్టులు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించడంతో మిథున్ రెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మిథున్ రెడ్డి అరెస్టుతో వైసీపీ కీలక నేతల్లో ఆందోళన నెలకొంది.
305 పేజీల ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలు
విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు 305 పేజీల ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఈ ఛార్జ్‌షీట్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ పేరును పలు సార్లు ప్రస్తావించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, దాని అమలులో తీసుకున్న నిర్ణయాలన్నీ జగన్‌కు తెలిసే జరిగాయని సిట్ పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆయనను నిందితుడిగా చేర్చలేదు. విచారణ పూర్తయ్యాక మాత్రమే ఆ అంశంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈ ఛార్జ్‌షీట్‌లో 70 వాల్యూమ్స్, 28 ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు, ఆడియో–వీడియో ఆధారాలు, సీడీఆర్ వివరాలు ఉన్నాయి. మొత్తం 40 మంది వ్యక్తులు, పలు సంస్థలు నిందితులుగా ఉన్న ఈ కేసులో తాజాగా మరో 8 మందిని చేర్చారు.
కొత్తగా చేర్చిన నిందితులు
తాజాగా సిట్ నిందితుల జాబితాలో సుజల్ బెహ్రూన్, అనిల్ కుమార్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, సైమన్ ప్రసన్, బొల్లారం శివకుమార్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్‌లను చేర్చింది. మొత్తంగా 48 మంది నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: A. M. Rathnam: ఎ.ఎం రత్నంపై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు.. నైజాంలో రిలీజ్ అవడం ఇక కష్టమేనా?
ముడుపుల సొమ్ము – హవాలా లావాదేవీలు బయటపడ్డాయి
సిట్ ఛార్జ్‌షీట్ ప్రకారం, మద్యం ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేశారు. ఇప్పటికే 62 కోట్ల రూపాయలు జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సొమ్మును హవాలా మార్గంలో తరలించారని, రియల్ ఎస్టేట్ కంపెనీల ఖాతాలను అడ్డం పెట్టుకుని లావాదేవీలు జరిపారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
అలాగే ముంబై, ఢిల్లీ, దుబాయ్, తాడేపల్లి, హైదరాబాద్‌లలో మొత్తం 9 డెన్ల ద్వారా ముడుపుల సొమ్ము చలామణి అయినట్లు గుర్తించారు. బంగారం కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల రూపంలో డబ్బును దాచిపెట్టినట్లు సిట్ తెలిపింది.
ఎన్నికల్లో డబ్బు వాడకం ఆధారాలు
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ముడుపుల సొమ్ము తరలించిన వివరాలను సిట్ ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. నోట్ల కట్టలతో ఉన్న నిందితుల వీడియోలు, ఆడియో రికార్డులు, ఫోరెన్సిక్ నివేదికలు కూడా సమర్పించారు.
తదుపరి దర్యాప్తు దశ
ఇది కేవలం ప్రాథమిక ఛార్జ్‌షీట్ మాత్రమే. త్వరలో మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. అందులో ముడుపులు ఎవరికి చేరాయి? ఎవరు లబ్ధిపొందారు? అనే అంశాలను స్పష్టంగా ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం.