Gottipati Ravikumar: మొంథా తుఫానును సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని, ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో తాము నిరంతరం పని చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ముందస్తుగా అప్రమత్తమైందని మంత్రి తెలిపారు.
నష్టం జరిగినప్పటికీ, 24 గంటల్లోనే విద్యుత్ వ్యవస్థను ప్రధానంగా పునరుద్ధరించగలిగామని మంత్రి వెల్లడించారు. ఈ వేగవంతమైన పునరుద్ధరణ కోసం సుమారు 1500 మంది విద్యుత్ శాఖ సిబ్బందిని తుఫాను ప్రభావిత ప్రాంతాలకు రెండు రోజుల ముందే మోహరించామని పేర్కొన్నారు. కొన్ని చోట్ల గాలుల వేగం విపరీతంగా ఉండటం వల్ల ప్రజల భద్రత దృష్ట్యా తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
భారీ నష్టం-వేగవంతమైన పునరుద్ధరణ
మొంథా తుఫాను కారణంగా విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గణాంకాలతో సహా తెలిపారు. తుఫాను ధాటికి 13 వేల విద్యుత్ స్తంభాలు నేలకూలాయని, 3 వేల కిలోమీటర్ల మేర కండక్టర్లు (వైర్లు), అలాగే 3 వేల ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
Also Read: Sudharshan Reddy: కీలక బాధ్యతలు అందుకున్న సుదర్శన్‌రెడ్డి.. ఆరు గ్యారంటీలకు ఆయనే బాధ్యుడు!
ఈ స్థాయిలో నష్టం జరిగినా, విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి నిరంతరాయంగా పని చేయడం వల్లే త్వరితగతిన పునరుద్ధరణ సాధ్యమైందని మంత్రి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. వ్యవసాయ, ఆక్వా రంగాలకు సంబంధించి పడిపోయిన విద్యుత్ స్తంభాలను మరో 48 గంటల్లో పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి చర్యలు చేపడుతున్నట్లు హామీ ఇచ్చారు.
తుఫాను విపత్తు నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విపత్తు పరిశీలన అంటే గతంలో ‘రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన’ జగన్‌కు తుఫాన్ల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన విమర్శించారు. ముందస్తు చర్యల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదన్నది మాజీ సీఎం బాధేమో? అంటూ మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. తాము ప్రజల ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా నిజాయితీగా పని చేశామని, రాజకీయ విమర్శలకు ఇక్కడ తావు లేదని గొట్టిపాటి రవికుమార్ ఉద్ఘాటించారు. మొంథా తుఫాను అనంతర పరిస్థితులను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు.


