Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి చిచ్చురేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు రాజధాని లేని చోట చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, భౌగోళికంగా అమరావతి రాజధాని నిర్మాణానికి ఏమాత్రం పనికిరాదని జగన్ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని పరిస్థితిని సమీక్షించాలని ఆయన కోరడం గమనార్హం.
రివర్ బేసిన్ (నదీ పరివాహక ప్రాంతం)లో అమరావతిని నిర్మిస్తున్నారని, నదిలో భవనాలు కట్టేందుకు ఎవరైనా అనుమతిస్తారా అని జగన్ ప్రశ్నించారు. “సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అవుతుంది తప్ప, అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తూ నది ఒడ్డున కట్టడాలు చేపట్టడం వల్ల పర్యావరణపరంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిని నిజంగా కట్టాలనుకుంటే గుంటూరు-విజయవాడ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాల్లో నిర్మిస్తే బాగుంటుందని ఆయన సూచించారు.
అంకెల్లో అమరావతి.. ఆర్ధిక భారమా?
రాజధాని పేరుతో మొదటి విడతలో ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్నారని, ఇప్పుడు రెండో విడత పేరుతో మరో 50 వేల ఎకరాలను సేకరించడం వెనుక మతలబు ఏంటని జగన్ నిలదీశారు.
చంద్రబాబు ప్రభుత్వం సేకరిస్తున్న మొత్తం లక్ష ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే సుమారు రూ. 2 లక్షల కోట్లు అవసరమవుతాయని జగన్ విశ్లేషించారు.
ఇది కూడా చదవండి: Desi Lolli: ప్రవాస యువత భావోద్వేగాలే కథగా ‘దేశీ లొల్లి’ చిత్రం!
గతంలో 50 వేల ఎకరాల అభివృద్ధికి లక్ష కోట్లు కావాలని చంద్రబాబు చెప్పారని, ఆ నిధులు ఎప్పుడు, ఎలా వస్తాయో ఎవరికీ తెలియదని ఆయన విమర్శించారు. ఇన్ని వేల కోట్లు ఒకే ప్రాంతంపై ఖర్చు చేయడం వల్ల రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు వెనుకబడిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బోరుమంటున్న రైతులు.. అమలుకాని హామీలు
భూములిచ్చిన రైతులకు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని జగన్ ఆరోపించారు. రాజధాని అభివృద్ధి చెందుతుందన్న ఆశతో వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు నేడు ప్రభుత్వం తీరుతో బోరుమంటున్నారని పేర్కొన్నారు. ఉన్న భూములే అభివృద్ధి చేయలేని ప్రభుత్వం, ఇప్పుడు అదనంగా మళ్ళీ భూసేకరణ చేపట్టడం ప్రజలను వంచించడమేనని మండిపడ్డారు.
అమరావతి ప్రాంతంలో చేపట్టే భారీ నిర్మాణాలు భవిష్యత్తులో విపత్తులకు దారితీసే అవకాశం ఉందని, అందుకే అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని జగన్ కోరారు. అమరావతి విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన తన విమర్శల్లో స్పష్టం చేశారు.
