SRI CHAITHANYA SCAMS: అవినీతిలో నెంబర్ వన్, అక్రమార్జనలో టాప్ ప్లేస్ కైవసం చేసుకున్న ఏకైక సంస్థ శ్రీ చైతన్య విద్యా సంస్థలు. చెప్పేవి శ్రీరంగనీతులు ఆచరణలో శూన్యం. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు యావత్తు ప్రైవేట్ విద్యా రంగ సంస్థల్లో భారీ కలకలాన్ని రేకెత్తించింది. విద్యార్థుల వద్ద నుండి నిబంధనలకు విరుద్ధంగా ముక్కు పిండి ఫీజుల రూపంలో అనధికారికంగా కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ.. బ్లాక్ మనీని వెనకేసుకుని పబ్బం గడుపుకుంటున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు… ఐటీ అధికారులకి తప్పుడు లెక్కలు చూపించి బురిడీ కొట్టడంలో ఆరితేరిన వైనాన్ని చూసి.. ఐటీ శాఖ అవాక్కవుతోంది. పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న చందంగా తయారై, ర్యాంకుల పేరు చెప్పి అత్యంత గిరాకీకి సీట్లు అమ్ముకుంటున్న శ్రీ చైతన్యకు లేరు మరెవ్వరు సాటి
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు అనుమానంతో ఐటీ అధికారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు నగరాల్లోని శ్రీ చైతన్య కళాశాలల శాఖలపై ఏకకాలంలో దాడులను చేపట్టారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో భారీగా ఫీజులు వసూలు చేసి, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ లావాదేవీలు, విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ, ఫీజుల నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దాదాపు 20 మంది ఐటీ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొని, గతంలో సంస్థ ఐటీ శాఖకు సమర్పించిన రిటర్న్స్‌ను లావాదేవీలను పూర్తిగా పరిశీలన చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు నెలకొల్పారు. ఎక్కడ చూసినా ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ అవినీతిమయంగా కనిపిస్తున్న నేపథ్యం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన ప్రతి జిల్లాలో పదుల సంఖ్యలో శ్రీ చైతన్య విద్యాసంస్థలను నెలకొల్పారు. అందులో కేవలం ఒక విద్యాసంస్థకు అనుమతి తీసుకొని, ఆ పేరు మీద మరికొన్ని విద్యాసంస్థల్ని అనధికారికంగా నెలకొల్పడం పరిపాటిగా మారింది. ట్యూషన్ పాయింట్స్ పేరు మీద, కోచింగ్ సెంటర్ల పేరు మీద శ్రీ చైతన్య విద్యాసంస్థలను నెలకొల్పి శ్రీ చైతన్య బ్రాండ్ మీద వేలాది విద్యార్థులను తమ సంస్థలో చేర్పించుకొని.. తద్వారా వారి వద్ద నుండి లక్షలాది రూపాయలు ఫీజులను కేవలం నగదు రూపంలో మాత్రమే వసూలు చేసి.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏడాది కొన్ని వేల కోట్ల రూపాయలు బ్లాక్ మనీని వెనకేసుకుంటూ ఐటీ శాఖ అధికారులను బురిడి కొట్టిస్తూ… పన్ను ఎగవేతలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది శ్రీ చైతన్య.
శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థుల హాజరు రిజిస్టర్ను అధికారికంగా ఒకటి, అనధికారికంగా మరొకటి.. ఇలా రెండు రిజిస్టర్లు మెయింటైన్ చేస్తూ పిల్లల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఒక సంస్థ పేరు మీద అనుమతులతో పలు సంస్థలు నడుపుతూ.. శ్రీ చైతన్య సంస్ధ పేరుతో ట్యూషన్ పాయింట్లు, కోచింగ్ సెంటర్లను నెలకొల్పి.. అనధికారికంగా విద్యార్థులను జాయిన్ చేసుకుంటూ… పరీక్షల సమయంలో ఇతర కాలేజీల పేరు మీద పిల్లలతో పరీక్షలు రాయిస్తూ, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సైతం మోసం చేస్తూ, విద్యా రంగంలో అత్యంత భారీ స్థాయిలో అవినీతికి తెరతీసిన శ్రీచైతన్య బండారం బట్టబయలైంది.
Also Read: AP NEW DISTRICSTS: కొత్త జిల్లాకు గ్రీన్ సిగ్నల్
SRI CHAITHANYA SCAMS: అధికారికంగా ఆన్‌లైన్ పద్ధతిలో ఫీజులు స్వీకరించాల్సిన విద్యా సంస్థ, నగదు రూపంలో ఫీజులు తీసుకుంటూ… పన్ను ఎగవేయడానికి ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సైతం ఉపయోగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నగదు రూపంలో వసూలు చేసిన ఫీజులను ఐటీ రిటర్న్స్‌లో చూపించకుండా, పన్ను ఎగవేయడం జరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి ఏడాది వేలాది విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు, పరీక్ష ఫీజులు, అడ్మిషన్ ఫీజులు అంటూ వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. అయితే, ఈ లావాదేవీలు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతున్నాయని, దీనివల్ల పన్ను ఎగవేతకు అవకాశం ఉందని ఐటీ అధికారులు చెప్తున్నారు. సంస్థపై అందిన సమాచారం ప్రకారం, కొన్ని అకౌంటింగ్ లెక్కలు కుదిర్చేందుకు ఇన్వాయిసులను సరిగ్గా నమోదు చేయకుండా ఉండటాన్ని కూడా దర్యాప్తులో గుర్తించారు. ప్రస్తుత దర్యాప్తులో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, సంస్థ ప్రధాన నిర్వాహకులను విచారించే అవకాశముంది. అలాగే, సంస్థ లావాదేవీలు నిర్వహించిన ప్రైవేట్ అకౌంటెంట్స్‌ను, సంస్థకు సంబంధించిన కీలక బజినెస్ అకౌంటింగ్ వివరాలను విశ్లేషిస్తున్నారు. ఐటీ శాఖ అధికారులు ఈ తనిఖీల ద్వారా సంస్థ ఎన్ని కోట్ల రూపాయల పన్ను ఎగవేశారనే విషయాన్ని తేల్చనున్నారు.
విద్యార్థులను కేవలం ధనార్జన చేసే ఒక యంత్రంగా మాత్రమే చూడడం శ్రీ చైతన్య స్పెషాలిటీ. తమ పిల్లకు భవ్యమైన భవిష్యత్ ఇవ్వాలని కలలు కంటూ.. అందుకు తల తాకట్టు పెట్టేందుకు కూడా సిద్ధపడే మధ్యతరగతి, ఎగువమధ్య తరగతి కుటుంబాలే శ్రీ చైతన్య టార్గెట్. శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్ చదివి ఒక విద్యార్థి బయటకు రావాలంటే మినిమం మూడు లక్షల నుండి నాలుగు లక్షల వరకు ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తారు. ఎలాంటి విద్య ప్రమాణాలు పాటించకుండా, నాణ్యతలేని నామమాత్రపు విద్యను అందిస్తూ ఇటు విద్యార్థులను అటు పేరెంట్స్ ను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రతి జిల్లాకి కేవలం ఒక 10 మంది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని.. రోజుకి 14 నుండి 16 గంటలపాటు వారిని బంధీలను చేసి బలవంతపు చదువులు రుద్దుతూ.. తద్వారా ర్యాంకులు సంపాదించి, వారిని ఎరగా వేసి రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే మేమే టాప్ అని డబ్బా కొట్టుకోవడం వారి ప్రధాన స్ట్రాటజీ. ర్యాంకుల కోసం విద్యార్థులపై వీరు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థులు ఎందరో! భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకుని, మరణించిన వారికి ఆత్మశాంతి కలగజేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తోంది మహాన్యూస్.