ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరియు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక నైసార్ ఉపగ్రహాన్ని మోసుకుంటూ జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 2,393 కిలోల బరువుతో కూడిన ఈ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారత్ మరో కీలక అంతరిక్ష విజయాన్ని నమోదు చేసింది.
నైసార్ అంటే ఏమిటి?
నైసార్ (NISAR) అనగా NASA-ISRO Synthetic Aperture Radar. ఇది భూమి ఉపరితల మార్పులను అత్యంత ఖచ్చితంగా గుర్తించే అత్యాధునిక పరిశీలన శాటిలైట్. దీనిలో రెండు పెద్ద డిష్‌ల వంటి నిర్మాణాలు ఉన్నాయి, ఇవి భూమిపైన మైక్రోవేవ్, రేడియో వేవ్ సంకేతాలను పంపించి, అవి భూమిని తాకి తిరిగి వస్తే, వాటిని విశ్లేషించి తగిన దృశ్యాలుగా మారుస్తాయి.
ఈ శాటిలైట్ ప్రత్యేకతలు:
భూకంపాలు, భూచలనలు, మంచు కరిగిపోవడం, అరణ్య నష్టం వంటి ప్రకృతి మార్పులను ముందుగానే గుర్తించగలదు.
ప్రకృతి విపత్తులపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చే సామర్థ్యం ఈ ఉపగ్రహానికి ఉంది.
శాస్త్రీయ పరిశోధనలు, పర్యావరణ మార్పులపై అధ్యయనాల్లో నైసార్ కీలక పాత్ర పోషించనుంది.
నాసా–ఇస్రో భాగస్వామ్యం వెనుక ఉద్దేశం: ప్రపంచంలో అత్యంత చవకగా, సమర్థవంతంగా శాటిలైట్‌లను కక్ష్యలోకి పంపే సామర్థ్యం ఉన్న ఇస్రోతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో నాసా ఈ సంయుక్త ప్రాజెక్టులో భాగస్వామిగా నిలిచింది.
ఈ సంయుక్త ప్రయోగం, భవిష్యత్ అంతరిక్ష సహకారాలకు దారితీసే కీలక ఘట్టంగా నిలిచింది.