PSLV-C61

PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య.. మూడోదశలో గుర్తించిన ఇస్రో..!

PSLV-C61: దేశం గర్వపడే అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకి ఈసారి చిన్న నిరాశ ఎదురైంది. శ్రేణి విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో ప్రస్థానంలో PSLV-C61 మిషన్ విఫలమైందన్న వార్త శాస్త్రవేత్తలతో పాటు దేశ ప్రజల్లో కూడా ఆవేదన కలిగిస్తోంది. భారత రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంపిన EOS-09 (RISAT-1B) భూ పరిశీలన ఉపగ్రహం మిషన్ సగానికి చేరక ముందే సాంకేతిక లోపానికి గురైంది.

ఈ నెల 18వ తేదీ ఉదయం 5:59 గంటలకు, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C61 రాకెట్ నింగిలోకి ప్రయాణం ప్రారంభించింది. మొదటి రెండు దశలు సజావుగా పూర్తవగా, మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో మిషన్ నిలిచిపోయింది. ఈ విషయం గురించి ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ స్పందిస్తూ, “మిషన్ పూర్తికాలేదు. మూడో దశలో సమస్య తలెత్తింది. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం,” అని తెలిపారు.

EOS-09 శాటిలైట్‌ లక్ష్యాలు:
సరిహద్దుల్లో నిఘా: ఈ శాటిలైట్ పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకంగా మారింది. భూమిపై అన్ని వాతావరణాల్లోనూ స్పష్టమైన చిత్రాలు అందించే సామర్థ్యం దీనికి ఉంది. రాత్రి, పగలు పని: దీని కెమెరాలు పగలు, రాత్రి తేడా లేకుండా పని చేస్తాయి. జాతీయ భద్రతకు తోడ్పాటు, శత్రు కదలికలపై డేటా ఇచ్చేలా డిజైన్ చేయబడింది. వ్యవసాయం, అటవీ పర్యవేక్షణ: భూభాగాల వాడకం, పంటల స్థితిగతులపై సమాచారం సేకరిస్తుంది. విపత్తు సమయంలో సహాయం వరదలు, అగ్నిప్రమాదాల వంటి సమయాల్లో ఉపయోగపడే చిత్రాలను ఇస్తుంది.

Also Read: Ceasefire: భారత-పాకిస్తాన్ కాల్పుల విరమణపై.. భారత ఆర్మీ సంచలన ప్రకటన

శాటిలైట్ వివరాలు:
పేరు: EOS-09 (RISAT-1B)

బరువు: 1,696.24 కిలోలు

జీవితకాలం: 5 ఏళ్లు

తయారీ: RISAT-1, RISAT-2B లాంటి శాటిలైట్ల తర్వాతి తరం ఉపగ్రహం

ముందస్తు ప్రత్యామ్నాయం: 2022లో ప్రయోగించిన EOS-04కు ప్రత్యామ్నాయంగా

PSLV-C61: ఈ మిషన్ విఫలం కావడం వెనుక అసలు కారణాలపై ప్రస్తుతం ఇస్రో లోతుగా విశ్లేషణ జరుపుతోంది. రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి చేయనుంది. ఇస్రో ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన ప్రయోగాలను చేపట్టి ప్రపంచ స్థాయిలో పేరుగాంచింది. ఈ ప్రయోగం ఫలితంగా తలెత్తిన సమస్యలు అనుభవాలుగా మారి, భవిష్యత్తులో మరింత పటిష్టమైన మిషన్లకు దోహదం చేస్తాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *