LVM3-M5 Rocket: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. ‘బాహుబలి’ రాకెట్‌గా పిలిచే LVM3-M5 ను ఆదివారం (నవంబర్ 2, 2025) సాయంత్రం సరిగ్గా 5:26 గంటలకు శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది.
ఈ ప్రయోగం ద్వారా 4,410 కిలోల బరువు ఉన్న అత్యంత బరువైన సమాచార ఉపగ్రహం ‘CMS-03 (జీశాట్-7R)’ ను తొలిసారిగా జియో ట్రాన్స్‌ఫర్ కక్ష్య (GTO – Geo-synchronous Transfer Orbit) లోకి విజయవంతంగా చేర్చింది. భారతదేశం తన సొంత గడ్డపై నుంచి ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైనది కావడం విశేషం.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన CMS-03 ఉపగ్రహం రాబోయే పదేళ్లపాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ భారతదేశానికి ముఖ్యమైన ఇంటర్నెట్, సమాచార సేవలను అందించనుంది. సుమారు 43.5 మీటర్ల పొడవైన ఈ LVM3-M5 రాకెట్, దాని బరువైన పేలోడ్ కారణంగా అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశానికి కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విజయం భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది పలికింది.


