విరాట్ కోహ్లీ టెస్టుల్లో అరుదైన రికార్డుల ముంగిట ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో తక్కువ స్కోర్లతోనే వెనుతిరిగిన కోహ్లీ ముందు కాన్పూర్ లో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ లో ముచ్చటగా మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. మరి వాటిని కోహ్లీ అందుకుంటాడా లేడా అనేది తేలడానికి ఇంకా కొద్దిగా సమయం ఉంది. ఈలోపు ఆ రికార్డులు ఏమిటన్నది ఓసారి మనం కూడా తెలుసుకుందాం.
9000 టెస్ట్ పరుగులకు చేరువలో..
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో 9 వేల పరుగులకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం అతను 114 టెస్టుల్లో 8,871 పరుగులు చేశాడు. కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌పై 129 పరుగులు చేస్తే కనుక అతను 9,000 పరుగుల మార్క్‌ను దాటగలడు. చెన్నై టెస్టులో 2 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి 6, 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
కాన్పూర్ టెస్టులో కోహ్లి 9000 పరుగుల మైలురాయిని దాటితే ఆ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. అంతకు ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ పని చేయగలిగారు.
బ్రాడ్‌మన్‌ను విరాట్ దాటుతాడా?
విరాట్ కోహ్లీ 114 టెస్టుల్లో 29 సెంచరీలు చేశాడు. అతను బంగ్లాదేశ్‌పై ఒక్క సెంచరీ అయినా సాధిస్తే, అతను ఆస్ట్రేలియా గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ కంటే ఎక్కువ సెంచరీలు స్కోర్ చేసిన వాడిగా నిలుస్తాడు. బ్రాడ్‌మాన్ 52 టెస్టుల్లో 29 సెంచరీలు చేశాడు. భారత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు టెండూల్కర్, ద్రవిడ్, గవాస్కర్ ఉన్నారు.
27 వేల అంతర్జాతీయ పరుగులకు చేరువలో..
విరాట్ కోహ్లీ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగులకు చేరువలో ఉన్నాడు. టెస్టు, వన్డే, టీ-20 మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకూ 534 మ్యాచ్‌ల్లో 26,965 పరుగులు చేశాడు. కాన్పూర్‌లో కేవలం 35 పరుగులు చేయడం ద్వారా అంతర్జాతీయంగా 27 వేల పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు. అతనికి ముందు సచిన్ టెండూల్కర్, శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ మాత్రమే ఈ ఘనత సాధించగలిగారు.