Ravichandran Ashwin

Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్‌మెంట్ వెనుక గంభీరే.. ఘాటు విమర్శలు

Ravichandran Ashwin: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టెస్ట్ ఫార్మాట్‌లో పరాజయాలను చవిచూడటంతో ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 0-2 తేడాతో వైట్‌వాష్ అయిన నేపథ్యంలో గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గంభీర్ నాయకత్వంలో టీ20లలో ఆసియా కప్, వన్డేలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటికీ, టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం ఆయన ప్రభావం చూపలేకపోయారు. అంతేకాకుండా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ ఫార్మాట్ నుంచి ఆకస్మికంగా రిటైర్ కావడానికి గంభీరే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.

భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తాజాగా గౌతమ్ గంభీర్‌పై ఘాటు విమర్శలు చేశారు. అశ్విన్ రిటైర్‌మెంట్ వెనుక గంభీరే ఉన్నారని ఆయన ఆరోపించారు. “మీరు స్క్వాడ్ బయట ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను నేరుగా జట్టులోకి తీసుకురావడం ద్వారా అశ్విన్‌ను అభద్రతకు గురి చేశారు.

ఇది కూడా చదవండి: Ravana: రావణుడికి నందీశ్వరుడు ఇచ్చిన శాపం ఏంటి?

ఇది అశ్విన్‌పై మీకు ఇక నమ్మకం లేదని స్పష్టంగా సూచిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం, ఇది అతనికి ఇబ్బంది కలిగించింది, అందుకే అశ్విన్ ఆస్ట్రేలియాలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు” అని తివారీ వ్యాఖ్యానించారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి, సిరీస్ ముగిసే వరకు కూడా వేచి చూడకుండా భారత్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి వైదొలగడం వెనుక కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉన్నాయని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడాలని కోరుకున్నప్పటికీ, గతంలోలాగా మేనేజ్‌మెంట్ నుంచి సమర్థన లభించకపోవడం వల్లే వారు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. “నిజానికి రోహిత్, విరాట్ ఇద్దరూ టెస్ట్ క్రికెట్ ఆడాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ, అలాంటి పరిస్థితులు ఏర్పడటంతో వారే గుడ్‌బై చెప్పారు. ఇలాంటి పరిణామాలు జట్టులో ఏ ఆటగాడికీ స్థిరత్వాన్ని ఇవ్వవు,” అని తివారీ గంభీర్ వైఖరిని తప్పుబట్టారు. టెస్ట్ ఫార్మాట్‌లో వరుస ఓటములు ఎదురైనప్పటికీ, ప్రస్తుతానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను తొలగించే ఉద్దేశం బీసీసీఐకి లేదని తెలుస్తోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *