Ireland: ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు ఇక్కడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలిస్తున్నది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలు, కాల్పుల ఘటనల్లో అనేక మంది తెలుగు విద్యార్థులు మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.
Ireland: తాజాగా ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు యువకుడు దుర్మరణం పాలవడం విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్ ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ దేశం వెళ్లాడు. ఇటీవలే తన చదువు పూర్తయింది. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.
Ireland: నిన్న రాత్రి తన స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. ఈ సమయంలో కారు రోడ్డుపై అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో తోటి స్నేహితులు ఈ సమాచారాన్ని జగ్గయ్యపేటలోని భార్గవ్ కుటుంబసభ్యులకు చేరవేశారు.
Ireland: భార్గవ్ మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భార్గవ్ తండ్రి చిత్తూరు సాయిబాబా స్థానిక ఆర్వో ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు ఉద్యోగం చేస్తాడని, తన కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని భావించిన తరుణంలో మరణవార్త వినడంతో హతాశుడయ్యాడు. ఆయనతోపాటు ఆకుటుంబ సభ్యుల దుఃఖభారాన్ని ఆపే తరం ఎవరికీ కావడం లేదని స్థానికులు తెలిపారు. త్వరలోనే భార్గవ్ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పిస్తారని తెలిపారు.