Indians In Iran: ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దాదాపు 10 వేల మంది భారతీయులు ఇరాన్లో ఉన్నట్లు అంచనా.
తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పేలుడు శబ్దాలు, సైరన్లతో అక్కడి వాతావరణం భయంకరంగా మారిందని స్థానికులు, విద్యార్థులు చెబుతున్నారు. టెహ్రాన్‌లోని షాహిద్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న ఇంతిసాల్ మొహిద్దీన్ అనే విద్యార్థి, తమ ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించిందని, అప్పటినుండి నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను త్వరగా స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. షాహిద్ యూనివర్సిటీలోనే దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని ఆయన తెలిపారు.
మరో విద్యార్థి ఫైజాన్ నబీ మాట్లాడుతూ, రోజూ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని, ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. తాగునీటిని కూడా జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారని తెలిపాడు.
Also Read: Fire Accident: చెలరేగిన మంటలు.. వెయ్యికిపైగా షాపులు దగ్దం
Indians In Iran: ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, భారతీయ విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకుంటోందని ప్రకటించింది. ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది. అవసరమైతే, ఇరాన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది.
ఇరాన్లో చిక్కుకున్న విదేశీయులను తరలించడానికి ఆ దేశం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం విమాన సేవలు నిలిచిపోయినందున, భూమార్గం ద్వారా తరలింపు ప్రక్రియను చేపట్టవచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ భారత్‌కు సూచించింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్లో తీవ్ర విధ్వంసం జరుగుతుండటంతో, తమ పిల్లల భద్రత పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారిని వెంటనే వెనక్కి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
