Iran Attack

Iran Attack: మంటల్లో మధ్యప్రాచ్యం.. గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్.. సామాన్యుడి జేబుకు చిల్లు పడనుందా?

Iran Attack: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విడ్ నేచురల్ గ్యాస్ (LNG) కేంద్రమైన ఖతార్‌లోని ‘రాస్ లఫాన్’పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటం సంచలనం సృష్టించింది. ఈ దాడి కారణంగా రాస్ లఫాన్‌లో గ్యాస్, చమురు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గతంలో ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ కేంద్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు కీలకమైన చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో గందరగోళం నెలకొంది.

ప్రపంచ ఇంధన ఎగుమతుల్లో అమెరికా, రష్యాల తర్వాత ఖతార్ అత్యంత కీలకమైన దేశం. ముఖ్యంగా రాస్ లఫాన్ కేంద్రం మూతపడటం ప్రపంచ చమురు సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోంది. మార్చి నెలలోనే ఖతార్‌పై ఇరాన్ దాడి చేయడం ఇది రెండోసారి. నిరంతరాయంగా జరుగుతున్న ఈ దాడుల వల్ల ఖతార్ ఎనర్జీ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనివల్ల గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి, ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారతదేశంపై ఈ దాడుల ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుంది. మన దేశం తన గ్యాస్ అవసరాల్లో దాదాపు 50 శాతాన్ని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో సింహభాగం అంటే దాదాపు 40 శాతం ఒక్క ఖతార్ నుంచే వస్తోంది. అంటే మనం వాడుతున్న మొత్తం గ్యాస్‌లో 20 శాతం ఖతార్ సరఫరా చేసేదే. ఇప్పుడు అక్కడ ఉత్పత్తి నిలిచిపోవడంతో భారత్‌కు గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే రోజుకు సుమారు 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగింది.

ఈ పరిస్థితుల దృష్ట్యా భారత్‌లో ఇంధన పొదుపు చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు భారత ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే ఇతర దేశాల నుండి గ్యాస్‌ను సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రవాణా మార్గాలు దెబ్బతిని, భవిష్యత్తులో సామాన్యులపై కూడా ధరల భారం పడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *