LSG vs KKR

LSG vs KKR: కోల్‌కతాపై లక్నో ఉత్కంఠ విజయం.. ముకుల్ చౌదరి వీరోచిత పోరాటం!

LSG vs KKR:  ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేసిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో జట్టు ఒక్క బాల్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ముకుల్ చౌదరి మెరుపు హాఫ్ సెంచరీతో లక్నోకు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందించాడు.

తడబడిన కేకేఆర్.. నిలకడగా ఆడిన రహానే, రఘువంశీ

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్  20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. యువ సంచలనం అంగ్‌కృత్ రఘువంశీ (45), కెప్టెన్ అజింక్య రహానే (41) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు మంచి పునాది వేశారు. ఒక దశలో స్కోరు 200 దాటుతుందని అనిపించినా, లక్నో బౌలర్లు మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేకేఆర్‌ను కట్టడి చేశారు. స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ (4) మరోసారి విఫలమవగా, చివర్లో రోవ్‌మన్ పావెల్ (39 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (32 నాటౌట్) ధాటిగా ఆడి జట్టుకు మంచి స్క్రోర్ ని అందించారు.

కష్టాల్లో లక్నో.. ఆదుకున్న బదోని

182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభం అంత సాఫీగా సాగలేదు. వైభవ్ అరోరా తన వరుస ఓవర్లలో ఎయిడెన్ మార్‌క్రమ్ (22), మిచెల్ మార్ష్‌ (15)లను అవుట్ చేసి లక్నోను దెబ్బతీశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (10), నికోలస్ పూరన్ (13) కూడా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో లక్నో కష్టాల్లో పడింది. అయితే ఆయుష్ బదోని (34 బంతుల్లో 54) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.

ముకుల్ చౌదరి విధ్వంసం.. ఆఖరి ఓవర్ డ్రామా

మ్యాచ్ చివరి దశకు వచ్చేసరికి లక్నోకు 12 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో ముకుల్ చౌదరి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా, వైభవ్ అరోరా వేసిన ఆ ఓవర్లో ముకుల్ సంయమనంతో ఆడి ఐదో బంతికే సిక్సర్‌తో విజయాన్ని ఖాయం చేశాడు. ముకుల్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అజేయంగా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు తీసినా, చివరి ఓవర్లో ఒత్తిడికి లోనై పరుగులు ఇచ్చేశాడు. ఈ ఓటమితో కేకేఆర్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయం పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *