Nicolas Maduro

Nicolas Maduro: బస్సు డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడిగా నికోలస్ మదురో..

Nicolas Maduro: వెనిజులా రాజకీయ యవనికపై దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఒక వివాదాస్పద అధ్యాయం అనూహ్య మలుపు తిరిగింది. ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడంతో, అటు వెనిజులాలోనూ, ఇటు అంతర్జాతీయ రాజకీయాల్లోనూ పెను సంచలనం నమోదైంది. హ్యూగో చావెజ్ వారసుడిగా, సోషలిస్ట్ విప్లవ ముసుగులో సాగిన మదురో సుదీర్ఘ పాలన అమెరికా దళాల మెరుపు దాడితో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రాజధాని కరాకస్‌పై శనివారం జరిపిన ఈ సైనిక ఆపరేషన్‌లో మదురో పట్టుబడటాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ధృవీకరించారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకున్న కఠిన నిర్ణయాలు, వెనిజులాపై పెంచిన సైనిక ఒత్తిడి వెరసి మదురో పతనానికి దారితీశాయి.

మదురో రాజకీయ ప్రస్థానం అత్యంత ఆసక్తికరం. రాజధాని కారాకాస్‌లో ఒక సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించిన ఆయన, తన జీవితాన్ని కరాకస్ సబ్‌వే సిస్టమ్‌లో బస్సు డ్రైవర్‌గా ప్రారంభించారు. అక్కడే యూనియన్ నాయకుడిగా ఎదిగి, క్యూబాలో రాజకీయ శిక్షణ పొందిన మదురో, క్రమంగా హ్యూగో చావెజ్‌కు అత్యంత నమ్మకస్తుడిగా మారారు. 1999లో చావెజ్ అధికారంలోకి వచ్చాక విదేశాంగ మంత్రిగా, వైస్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2013లో చావెజ్ మరణానంతరం అధ్యక్ష పీఠాన్ని అధిష్టించినప్పటికీ, చావెజ్‌కు ఉన్న ప్రజాదరణను మాత్రం ఆయన పొందలేకపోయారు. అప్పటి నుండి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ, విపక్షాలను అణచివేస్తూ అధికారాన్ని కాపాడుకుంటూ వచ్చారు.

ఇది కూడా చదవండి: Harish Rao: నదీజలాలు.. ద్రోహాలు.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ రావు ఎదురుదాడి!

మదురో పాలనలో వెనిజులా ఎదుర్కొన్న ఆర్థిక విపత్తు ఆధునిక చరిత్రలో అత్యంత దారుణమైనదిగా నిలిచిపోతుంది. 2012 నుండి 2020 మధ్య కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏకంగా 71 శాతం పడిపోయింది. ద్రవ్యోల్బణం ఊహకందని రీతిలో 1.30 లక్షల శాతానికి చేరుకోవడంతో సామాన్యుడి బతుకు దుర్భరమైంది. ఆహారం, మందులు దొరక్క జనం అల్లాడిపోయారు. ఈ ఆర్థిక సంక్షోభం భరించలేక సుమారు 77 లక్షల మంది ప్రజలు తమ మాతృభూమిని వదిలి వలస వెళ్లడం మదురో వైఫల్యానికి నిదర్శనం. దీనికి తోడు, తనను వ్యతిరేకించిన వారిని చిత్రహింసలకు గురిచేయడం, జైల్లో బంధించడం వంటి చర్యల వల్ల ఆయన అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ICC) దర్యాప్తును కూడా ఎదుర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: Fire Accident: త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. 500కు పైగా బైకులు బుగ్గి!

ఆసక్తికరమైన విషయమేమిటంటే, కఠిన నియంతగా ముద్రపడిన మదురో ఆధ్యాత్మికంగా పుట్టపర్తి సత్య సాయిబాబాను తీవ్రంగా విశ్వసించేవారు. 2005లో భారత పర్యటనలో ఉన్నప్పుడు ఆయన పుట్టపర్తిని సందర్శించి సాయిబాబా ఆశీస్సులు తీసుకున్నారు. తన కార్యాలయంలో కూడా సాయిబాబా చిత్రపటాన్ని ఉంచుకునేవారు. అయితే, ఆయన అనుసరించిన అణచివేత ధోరణి, 2024 ఎన్నికల్లో జరిగినట్లుగా భావిస్తున్న అక్రమాలు ఆయన పతనానికి పునాది వేశాయి. వెనిజులా విపక్ష నేత ఎడ్మండో గొంజాలెజ్‌ను అసలైన అధ్యక్షుడిగా గుర్తించిన అమెరికా, చివరకు సైనిక చర్య ద్వారా మదురోను బంధించి న్యూయార్క్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. దీంతో వెనిజులాలో ఒక నియంతృత్వ శకం ముగిసి, నవశకానికి నాంది పలికినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *