International: కనుమరుగవుతున్న దేశం తువాలు… పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా

International: వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశమైన తువాలు క్రమంగా తన అస్తిత్వాన్ని కోల్పోతోంది. ఈ పరిస్థితుల్లో తువాలు పౌరుల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. తువాలు ప్రజలకు ఆశ్రయం కల్పించే చారిత్రాత్మక ఒప్పందం కింద తొలి వలసదారుల బృందం ఈ వారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది.

వాతావరణ మార్పుల కారణంగా ముంపు ముప్పును ఎదుర్కొంటున్న తమ పౌరులకు “గౌరవప్రదమైన వలస” అవకాశం కల్పించాలని తువాలు ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, 2023లో ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం తువాలు పౌరులకు ప్రత్యేక వీసాలు జారీ చేస్తున్నారు. ఈ వీసాల ద్వారా వారు ఆస్ట్రేలియాలో నివసించడంతో పాటు చదువు, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. అర్హత సాధించిన వారికి ఆస్ట్రేలియా పౌరసత్వం కల్పించే అవకాశం కూడా ఉంటుంది.

ఆస్ట్రేలియాకు చేరుకున్న వెంటనే తువాలు పౌరులకు విద్య, వైద్య బీమా (మెడికేర్), ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయి. ఇది వాతావరణ శరణార్థుల సమస్యకు మానవీయ పరిష్కారంగా నిలుస్తోందని అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తున్నాయి.

సుమారు 11 వేల జనాభా మాత్రమే ఉన్న తువాలు నుంచి ఈ ఏడాది జూన్‌లో వీసా దరఖాస్తులు ప్రారంభం కాగానే 3 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే దేశంలో మేధోవలస (బ్రెయిన్ డ్రెయిన్) నివారించేందుకు ఏటా కేవలం 280 మందికి మాత్రమే వీసాలు మంజూరు చేయాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ, “వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రమవుతున్న ఈ సమయంలో తువాలు పౌరులకు ఆస్ట్రేలియాలో కొత్త జీవితం ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాం” అని తెలిపారు. మరోవైపు తువాలు ప్రధాని ఫెలెటి టియో, వలస వెళ్లే పౌరులు తమ సంస్కృతి, సంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు.

వాతావరణ మార్పుల కారణంగా ఒక దేశం నెమ్మదిగా కనుమరుగవుతున్న సందర్భంలో, మరో దేశం ఆ ప్రజల భవిష్యత్తుకు అండగా నిలవడం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచంలోనే ఈ తరహా ఒప్పందం ఇదే తొలిసారి కావడం విశేషం.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *