హైదరాబాద్ లో దారుణం జరిగింది.ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన అనూష బాచుపల్లి చౌరస్తాలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. కొద్ది రోజులుగా ఇంట్లో ఉంటున్న ఆమెను తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం కారులో తీసుకొచ్చి హాస్టల్ వద్ద దించి వచ్చిన కారులోనే తిరుగు పయణమయ్యారు.
అయితే వారు సగం దూరం కూడా వెళ్లకుండానే హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది. అనూష స్పృహ కోల్పోయిందని నిర్వాహకులు చెప్పారు. దీంతో హుటాహుటిన వారు తిరుగు పయణమయ్యారు. అక్కడి వెళ్లే సరికి అనూష ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పారు. అయితే వారు రాకముందే మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.