Anakapalli: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. తాను ప్రేమించిన యువకుడు తనతో మాట్లాడటం లేదనే మనస్తాపంతో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
మరణానికి ముందు ఆ యువతి ఒక ఆత్మహత్య లేఖ రాసింది. తాను ఒక యువకుడిని ప్రాణంగా ప్రేమించానని, అతను లేకుండా తాను జీవించలేనని అందులో పేర్కొంది. అయితే, తాను మరొకరిని ప్రేమిస్తున్నానని సదరు యువకుడు తప్పుగా అర్థం చేసుకున్నాడని, అందుకే తనతో మాట్లాడటం మానేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన వల్ల తల్లిదండ్రులకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు లేఖలో వివరించింది.
మరోవైపు, మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు కీలక సమాచారం అందించారు. తమ కుమార్తె పుస్తకాలు కొనడానికి బయటకు వెళ్ళిన సమయంలో, అక్కడ ఒక యువకుడితో గొడవ పడటం తాము గమనించామని వారు తెలిపారు. ఆ గొడవ జరిగిన కొద్దిసేపటికే మనస్తాపానికి గురై తమ బిడ్డ తనువు చాలించిందని వారు కన్నీరుమున్నీరయ్యారు.
కోటవురట్ల ఎస్సై రమేష్ ఈ ఘటనపై స్పందిస్తూ.. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, అసలు కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. చిన్న వయసులోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
