Intel layoffs: ప్రపంచ ప్రసిద్ధ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. 2025 చివరి నాటికి కంపెనీలోని ఉద్యోగుల సంఖ్యను 75,000కి పరిమితం చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపడుతోంది.
ప్రస్తుతం ఇంటెల్‌లో 1,08,900 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటికే 2025 ఏప్రిల్ నుంచి 15,000 మందిని తొలగించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 15 శాతంకి సమానం. కంపెనీ 2025 రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించే సమయంలో ఈ తొలగింపును అధికారికంగా ధృవీకరించింది.
ఆర్థిక ఒత్తిడి కారణం
ఇంటెల్ కొత్త సీఈఓ లిప్ బు టాన్ మాట్లాడుతూ, కంపెనీ ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొంటోందని, అందువల్ల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. జర్మనీ, పోలాండ్‌లలో నిర్మించాల్సిన కొత్త ఫ్యాక్టరీ ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేసింది. కోస్టారికాలోని కొన్ని కార్యకలాపాలను వియత్నాం, మలేషియాలకు మార్చే ప్రణాళికలు కూడా ప్రారంభించింది. ఈ మార్పులు నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు సహాయపడతాయని కంపెనీ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Chandrababu: ఏపీని హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీగా మారుస్తాం
అగ్రగామి నుంచి వెనుకబడిన ఇంటెల్
1990ల పర్సనల్ కంప్యూటర్ బూమ్ సమయంలో మైక్రోప్రాసెసర్ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఇంటెల్, స్మార్ట్‌ఫోన్ యుగం వచ్చిన తర్వాత క్రమంగా తన ఆధిపత్యాన్ని కోల్పోయింది.
ఇటీవలి కాలంలో ఎన్విడియా వంటి కంపెనీలు వేగంగా ఎదగడం, అలాగే ఏఐ చిప్ సెట్ విభాగంలో ఇంటెల్ వెనుకబడిపోవడం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. ఒకప్పుడు గ్లోబల్ చిప్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించిన ఇంటెల్, ఇప్పుడు తన పాత స్థాయిని నిలబెట్టుకోవడానికి కష్టపడుతోంది.