Hyderabad

Hyderabad: ప్రేమ పేరుతో మోసం.. యువతిపై మనస్తాపంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ శివారులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేసిందనే తీవ్ర మనస్తాపంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు పవన్ కళ్యాణ్ రెడ్డి (26) మేడ్చల్ జిల్లా, పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు.

పవన్ కళ్యాణ్ రెడ్డి స్వస్థలం గుంటూరు జిల్లాలోని సంగడిగుంట ఐపీడీకాలనీ. ఆటో డ్రైవర్ కుర్రా శ్రీనివాస్ రెడ్డి కుమారుడైన పవన్, పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో తన స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గత నాలుగేళ్లుగా అతను ఇన్ఫోసిస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను ఒక యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకునే ఉద్దేశంతో శారీరకంగా కూడా దగ్గరైనట్లు తెలుస్తోంది.

Also Read: Black Friday Sales: దిమ్మతిరిగే ఆఫర్ తో బ్లాక్ ఫ్రైడే సేల్స్ వచ్చేశాయి..

ప్రస్తుతం ఆ యువతి గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇటీవల పవన్ కళ్యాణ్ రెడ్డికి ఆ యువతి దగ్గర మరొక వ్యక్తి ఫోటోలు, వారితో కలిసి ఉన్న ఫోటోలు కనిపించాయి. దీంతో అతనికి ఆమెపై అనుమానం పెరిగింది. మనస్తాపం చెంది, అతను ఆ ఫోటోలను ఆ యువతి కుటుంబ సభ్యులకు పంపించాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి, పవన్ కళ్యాణ్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ రెడ్డి ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు. తీవ్ర నిరాశకు గురైన పవన్ కళ్యాణ్ రెడ్డి, సోమవారం రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులు ఈ విషయాన్ని వెంటనే పవన్ తండ్రి శ్రీనివాస్ రెడ్డికి తెలియజేశారు. కుటుంబ సభ్యులు నగరానికి చేరుకున్నారు. తమ కుమారుడిని ప్రేమించిన యువతి మోసం చేసిందనే ఉద్దేశంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *