Indore: వరుసగా ఎనిమిదేళ్లుగా దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా నిలుస్తూ వస్తున్న ఇండోర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కలుషిత తాగునీటి సరఫరా కారణంగా నగరంలో ఇప్పటివరకు పది మంది మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. బాధ్యులపై చర్యల్లో భాగంగా ఇండోర్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ యాదవ్‌ను విధుల నుండి తొలగిస్తూ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Telugu Mahasabhalu: గుంటూరులో నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరికొందరు అధికారులపై కూడా వేటు పడింది. అదనపు మున్సిపల్ కమిషనర్ రోహిత్ సిస్సోనియా, ప్రజారోగ్య విభాగం ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ సంజీవ్ శ్రీవాస్తవను సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. క్లీన్ సిటీగా పేరున్న నగరంలో ఇలాంటి పరిస్థితి రావడంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న తాగునీటి సరఫరా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు.
