Crime News: మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఎంబీఏ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు పీయూష్ ధామ్నోడియా పోలీసుల విచారణలో తన పైశాచికత్వాన్ని అంగీకరించాడు. ప్రేమ, పెళ్లి పేరుతో మొదలైన ఈ కథ చివరకు హత్య, మరణం తర్వాత శవంపై లైంగిక దాడి, క్షుద్ర పూజల వంటి భయానక మలుపులు తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మందసౌర్‌కు చెందిన ఈ నిందితుడు తనతో పాటు చదువుతున్న యువతిని అత్యంత కిరాతకంగా అంతం చేశాడు.
రహస్య పెళ్లి.. పెరిగిన అనుమానం
పోలీసుల కథనం ప్రకారం, పీయూష్ – బాధితురాలు ఇండోర్‌లోని ఒకే కాలేజీలో ఎంబీఏ చదువుతున్నారు. వీరు గత ఏడాది నుండి ప్రేమలో ఉన్నారు. ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో జనవరిలో పీయూష్ తన రూమ్‌లోనే రహస్యంగా ఆమె మెడలో మాలి కట్టి, ఏడు అడుగులు వేయించాడు. అయితే, “నన్ను అందరి ముందూ భార్యగా అంగీకరించు” అని ఆమె పట్టుబట్టడంతో గొడవలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఆమెపై అనుమానం పెంచుకున్న పీయూష్, ఏకంగా ఆమె ఫోన్ హ్యాక్ చేసి ఆమె సంభాషణలను పర్యవేక్షించడం ప్రారంభించాడు.
ఆట పేరుతో ప్రాణం తీసి.. ఆపై పైశాచికం
ఫిబ్రవరి 10న పీయూష్ ఆమెను తన గదికి పిలిపించాడు. అక్కడ గొడవ జరిగినప్పటికీ, తరువాత ఇద్దరూ శారీరకంగా కలిశారు. అనంతరం “సరదాగా ఆట ఆడదాం” అని నమ్మించి ఆమె చేతులు, కాళ్లు కట్టేశాడు. ఆమె కదలలేని స్థితిలో ఉన్నప్పుడు గొంతు నులిమి చంపేశాడు. ప్రాణం పోయిందని నిర్ధారించుకోవడానికి చాకుతో పొడిచాడు. మానవత్వం మరచిన పీయూష్, ఆమె మరణించిన తర్వాత కూడా ఆ శవంపై పదే పదే లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ముంబైలో క్షుద్ర పూజలు
హత్య తర్వాత పీయూష్ ముంబై పారిపోయాడు. అక్కడ నాలాసోపారాలో ఉంటూ.. బాధితురాలి ఆత్మను పిలిచేందుకు యూట్యూబ్ చూస్తూ క్షుద్ర పూజలు చేశాడు. ఆమె ఫోటో ముందు పువ్వులు, పసుపు, కుంకుమ ఉంచి మంత్రతంత్రాలు నిర్వహించాడు. “హత్య చేశాక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా కానీ ధైర్యం సరిపోలేదు” అని నిందితుడు పోలీసుల ఎదుట విచారణలో తెలిపాడు.
