Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. సోమవారం ఉదయం తనింబర్ ఐలాండ్స్ ప్రాంతంలో 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని అమెరికా భూకంప పరిశోధన సంస్థ (USGS) వెల్లడించింది. ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
యూఎస్ జీయోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపం తూర్పు మలుకు ప్రావిన్స్‌లోని తువాల్ నగరానికి పశ్చిమాన సుమారు 177 కిలోమీటర్ల దూరంలో, భూమికి 80 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైనట్లు USGS పేర్కొంది. కాగా, మరికొన్ని నివేదికలు దీని తీవ్రత 6.9గా చూపించాయి. అయితే, ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఇది ప్రజలకు కొంత ఊరటనిచ్చే విషయం.
Also Read: Nipah Virus: కేరళను వణికిస్తున్న నిఫా వైరస్: ఇద్దరు మృతి, ఆరు జిల్లాల్లో హై అలెర్ట్
భూకంపం వచ్చిన సమయంలో భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. భవనాలు ఊగిసలాడటంతో ప్రాణాల రక్షణ కోసం వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు, కొన్ని చోట్ల నేలమట్టమైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే, ఇప్పటివరకు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గణనీయమైన ఆస్తి నష్టం జరిగినట్లు అధికారికంగా ధృవీకరించబడలేదు. స్థానిక అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియా “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉన్నందున, ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.